Telugu Global
Telangana

ఆ ఎన్నికల్లో మనదే రికార్డ్.. ఆలోచించి ఓటు వేయండి

చేసిన పని సరిగా చెప్పుకోలేక పోయామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని అన్నారు కేటీఆర్. ఈపాటికే ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడా గమనించారని, ప్రజలకు మంచి జరగాలంటే ప్రశ్నించే గొంతుక చట్ట సభల్లో ఉండాలని, అలా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవాలని అన్నారు.

ఆ ఎన్నికల్లో మనదే రికార్డ్.. ఆలోచించి ఓటు వేయండి
X

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లూ బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చిందని, ఈసారి కూడా తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం’ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి, ఆలేరులో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు కేటీఆర్. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజలకు మంచి చేసేవారెవరు, ప్రజల్ని ముంచేసే పార్టీలు ఏవో తెలుసుకోవాలన్నారు. రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడని, స్వయంకృషితో పైకి ఎదిగారని వివరించారు కేటీఆర్.


బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు కేటీఆర్‌. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. వాటి జాయినింగ్ లెటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయం కూడా ఆయన హయాంలోనే నిర్మితమైందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు కేటీఆర్. ఉమ్మడి నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని గుర్తుచేశారు. చేసిన పని సరిగా చెప్పుకోలేక పోయామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని అన్నారు. ఈపాటికే ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడా గమనించారని, ప్రజలకు మంచి జరగాలంటే ప్రశ్నించే గొంతుక చట్ట సభల్లో ఉండాలని, అలా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవాలని అన్నారు కేటీఆర్.


రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తోందన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలను ఇచ్చి అన్నింటినీ మర్చిపోయిందన్నారు. రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్ అని, సొల్లు కబుర్లు చెప్పే మోసగాడని ఎద్దేవా చేశారు కేటీఆర్.

First Published:  19 May 2024 2:39 PM GMT
Next Story