Telugu Global
Telangana

సంస్కారం లేని మూర్ఖులు- కేటీఆర్ ఘాటు విమర్శలు

ఇలాంటి దారుణాలు చూడలేకే రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో కలిపేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. #MyWrestlersMyPride అనే హ్యాష్ ట్యాగ్ ని తన ట్వీట్లకు జత చేశారు మంత్రి కేటీఆర్..

సంస్కారం లేని మూర్ఖులు- కేటీఆర్ ఘాటు విమర్శలు
X

దేశ రాజధానిలో భారత రెజ్లర్లకు జరిగిన అవమానం, వారిపై పోలీసుల దాడి, అరెస్ట్ లను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గతంలో తన ట్వీట్ ని ఆయన మరోసారి హైలెట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే విషయాన్ని గుర్తు చేశారు. సంస్కృతి సంస్కారం లేని మూర్ఖులంటూ ఘాటుగా విమర్శించారు.

రేపిస్ట్ లు జైలునుంచి విడుదలైతే స్వాగతం చెప్పేవారు..

హంతకులకు సన్మానాలు చేసే కేంద్ర మంత్రులు..

మహాత్ముడి దిష్టిబొమ్మలు దహనం చేసి అవమానించేవారు

పరీక్ష పేపర్లు లీక్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేవారు

వాళ్లే మన స్పోర్ట్స్ ఛాంపియన్లను అవమానిస్తున్నారు.. అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల తీరుని తీవ్రంగా ఎండగట్టారు. గతంలో తన ట్వీట్ ని గుర్తు చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు క్రీడాకారులకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు.


సిగ్గు సిగ్గు..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రక్షణ కవచంలా నిలిచారని మండిపడ్డారు కేటీఆర్. తప్పుచేశాడని తెలిసినా, ఓ ఎంపీని రక్షించడానికి భారత ప్రభుత్వం ఎందుకింతలా శ్రమిస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు చూడలేకే రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో కలిపేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. #MyWrestlersMyPride అనే హ్యాష్ ట్యాగ్ ని తన ట్వీట్లకు జత చేశారు మంత్రి కేటీఆర్..


మోదీ స్పందించరా..?

తమకి న్యాయం జరగడంలేదంటూ నిరసనగా తమకి వచ్చిన పతకాలను గంగా నదిలో కలిపేయడానికి రెజ్లర్లు సిద్ధమైతే కనీసం ప్రధాని మోదీ స్పందించడం లేదని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. ప్రధాని మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.

First Published:  31 May 2023 1:10 AM GMT
Next Story