Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి, బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు

వారం రోజుల్లోగా వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి, బండికి కేటీఆర్ లీగల్ నోటీసులు
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు కేటీఆర్.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(TSPSC) వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని తన నోటీసులో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే హక్కు వారికి లేదన్నారు. ఐపీసీ 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించినట్టు తెలిపారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్.

ఇక TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ జరుపుతోంది. అయితే ఈ విచారణ విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి. సీబీఐ, ఈడీతో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నారు బండి సంజయ్. TSPSC పేపర్ లీకేజీతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

First Published:  28 March 2023 3:38 PM GMT
Next Story