Telugu Global
Telangana

కేంద్రం ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా తెలంగాణ అభివృద్ధి కలలను సాకారం చేసుకుంటాం -కేటీఆర్

తెలంగాణ అభివృద్దికి కేంద్ర బీజేపీ సర్కార్ అడుగడుగునా అడ్డుపడుతున్నప్పటికీ తమ స్వంత శక్తితో తెలంగాణను అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర చూపిస్తున్న వివక్షపై కేటీఆర్ మండిపడ్డారు.

కేంద్రం ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా తెలంగాణ అభివృద్ధి కలలను సాకారం చేసుకుంటాం -కేటీఆర్
X

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, అభివృద్ది సాగకుండా ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఏ మాత్రం సహకరించకపోయినా తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపిస్తామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన... ''హైదరాబాద్ ఫార్మా, వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా ఉన్నప్పటికీ హైదరాబాద్ కు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను కేంద్రం తిరస్కరించింది. దాన్ని గుజరాత్‌కు కేటాయించింది. తెలంగాణలో DRDO ఉంది, పటిష్టమైన రక్షణ పరిశ్రమకు తెలంగాణ నిలయం అయినప్పటికీ కేంద్రం డిఫెన్స్ కారిడార్ ఇవ్వడానికి తిరస్కరించింది. యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసింది.'' అన్నారు.

నాగేశ్వర్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్... తెలంగాణ అభివృద్ధిలో ఎదుర‌య్యే అడ్డంకుల‌ను అధిగ‌మించ‌డం త‌మ‌కు తెలుసున‌న‌ని, త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకునే స‌త్తా కూడా త‌మ‌కు ఉంద‌ని వ్యాఖ్యానించారు.

''మీరు హైదరాబాద్ కు ITIR ని రద్దు చేసారు; అయినప్పటికీ మేము గత 8 సంవత్సరాలలో మా IT అభివృద్దిని 3.2 రెట్లు పెంచాము, గత సంవత్సరంలో దేశంలో సృష్టించబడిన ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ లోనే ఉంది.''

మీరు మా నీటిపారుదల ప్రాజెక్టులకు 'జాతీయ ప్రాజెక్ట్' హోదా ఇవ్వడానికి నిరాకరించారు; అయినప్పటికీ మేము కాళేశ్వరంలో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును సొంతంగా పూర్తి చేశాం.

మీ మద్దతుతో లేకపోయినా పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను కూడా మేము పూర్తి చేస్తాము''

''మీరు మిషన్ భగీరథకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు; అయినప్పటికీ మేము తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగు నీరు అందించి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచాము. '' అని కేటీఆర్ వరస ట్వీట్లు చేశారు.

కేంద్రం స‌కాలంలో నిధులు ఇవ్వ‌కున్నా... తాము మాత్రం దేశ జీడీపీలో 5 శాతం నిధుల‌ను దేశానికి అందిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహ‌కాల‌ను కేంద్రం నిరాక‌రిస్తున్నా తాము 1.6 మిలియ‌న్ల ఉద్యోగాల‌ను ఇచ్చామ‌న్నారు కేటీఆర్

First Published:  9 Sep 2022 4:32 PM GMT
Next Story