Telugu Global
Telangana

కాంగ్రెస్‌ అసలు రంగు ఇదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్‌

అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఇవ్వలేదని మాట మార్చిందన్నారు కేటీఆర్.

కాంగ్రెస్‌ అసలు రంగు ఇదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్‌
X

కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్‌ అంటూ ఈ మేర‌కు ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రధానంగా యువతను హస్తం పార్టీ మోసం చేసిందన్నారు.

120 రోజుల పాలన‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందన్నారు కేటీఆర్. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఇవ్వలేదని మాట మార్చిందన్నారు కేటీఆర్. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అన్ని వార్త పత్రికల మొదటి పేజీలో జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 30 వేల ఉద్యోగాలకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చి నిస్సిగ్గుగా ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుందన్నారు.


ఇక ఎన్నికలకు ముందు అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్‌.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుని, టెట్‌ పరీక్ష ఫీజును ఏకంగా 4 వందల నుంచి రూ.2 వేలకు పెంచిందన్నారు కేటీఆర్. ఇక బల్మూరి వెంకట్ లాంటి కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో ఎన్నో కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దు కావడానికి కారణమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్న వెంకట్.. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి పొందాడన్న కేటీఆర్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆశావహులను మాత్రం కాంగ్రెస్‌ దిక్కుతోచని స్థితిలో వదిలేసిందన్నారు. కాంగ్రెస్‌ అసలు రంగు ఇప్పుడే బయటపడుతోందని, ఆ పార్టీకి యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

First Published:  19 April 2024 5:33 AM GMT
Next Story