Telugu Global
Telangana

ఎన్నికల తర్వాత షిండే, బిశ్వా దారిలో రేవంత్ - కేటీఆర్

రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరికి రావాలని, ఇద్దరం కలిసి పోటీ చేద్దామంటూ మరోసారి సవాల్ విసిరారు కేటీఆర్. తెలంగాణ మోడల్‌ను కించపరుస్తూ గుజరాత్‌ మోడల్‌ను ఎలా ప్రశంసిస్తారంటూ ప్రశ్నించారు.

ఎన్నికల తర్వాత షిండే, బిశ్వా దారిలో రేవంత్ - కేటీఆర్
X

సీఎం రేవంత్‌ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్‌సభ ఎన్నికల తర్వాత వందకు వంద శాతం రేవంత్‌ రెడ్డి మరో ఏక్‌నాథ్‌ షిండే, హిమంత బిశ్వా అవుతారంటూ కామెంట్స్ చేశారు. 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను తీసుకుని.. రేవంత్‌ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు కేటీఆర్. కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. అధికారంలో ఉన్నప్పటికీ రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.


రేవంత్‌ రెడ్డి ఐదేళ్లు పదవిలో ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాల్సిందేనన్నారు. రేవంత్‌ పక్కనే మానవబాంబులు ఉన్నాయని, కాంగ్రెస్‌లోని పెద్దలతోనే రేవంత్‌కు ఇబ్బందులున్నాయంటూ కామెంట్స్ చేశారు. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరికి రావాలని, ఇద్దరం కలిసి పోటీ చేద్దామంటూ మరోసారి సవాల్ విసిరారు కేటీఆర్. తెలంగాణ మోడల్‌ను కించపరుస్తూ గుజరాత్‌ మోడల్‌ను ఎలా ప్రశంసిస్తారంటూ ప్రశ్నించారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ సెటైర్లు వేశారు. 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగితే దిద్దుబాటు చర్యలు చేపట్టరా అని ప్రశ్నించారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అన్న కేటీఆర్.. రేవంత్ రెడ్డికి మేడిగడ్డ, కాళేశ్వరం గురించి ఏం తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రేవంత్ చదువుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం గొంతెండే పరిస్థితి వచ్చిందన్నారు.

First Published:  7 March 2024 10:16 AM GMT
Next Story