Telugu Global
Telangana

రూ.వేల కోట్ల భూములు తాకట్టు.. రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మధ్యవర్తిగా ఓ మర్చంట్‌ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు కేటీఆర్.

రూ.వేల కోట్ల భూములు తాకట్టు.. రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌
X

ఆగస్టు 15లోగా రూ.2లక్షలలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రుణమాఫీ, పథకాల అమలుకు నిధుల సమీకరణ కోసం రేవంత్ సర్కార్‌ నానా తంటాలు పడుతోంది. ఇందులో భాగంగా రాయదుర్గం, కోకాపేటలో వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ ఫైనాన్స్‌ దగ్గర తాక‌ట్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. ఈ విలువైన భూములను ప్రైవేట్ ఫైనాన్స్‌ దగ్గర తనఖా పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్‌ దగ్గర తనఖా అంటే వడ్డీ భారీగా ఉండే అవకాశాలున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆర్థికభారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్‌ నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు మధ్యవర్తిగా ఓ మర్చంట్‌ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు కేటీఆర్.


ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుప‌డే ప్రమాదం ఉందన్నారు కేటీఆర్. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక.. తెలంగాణ బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతంలోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్యగా అభివర్ణించారు కేటీఆర్. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉందని.. కొత్త పెట్టుబడులు రావడం లేదన్నారు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్క చూపులు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏం ఇస్తారని ప్రశ్నించారు కేటీఆర్‌. పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని నిల‌దీస్తూ ట్వీట్ చేశారు.

First Published:  10 July 2024 4:11 AM GMT
Next Story