Telugu Global
Telangana

ఆయ‌న తండ్రే కాదు.. బాస్ కూడా..

తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ చాలా సరదాగా ఉన్నారు. హానెస్ట్‌లీ బై తన్మయ్ భట్.. కార్యక్రమంలో కేటీఆర్ గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపించారు, వినిపించారు.

ఆయ‌న తండ్రే కాదు.. బాస్ కూడా..
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ లాగే ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తుంటారు. స్టేజ్ పై మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చినా హుందాగా మాట్లాడతారు, అవసరమైనంత మేర స్పందిస్తారు. కానీ తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ చాలా సరదాగా ఉన్నారు. హానెస్ట్‌లీ బై తన్మయ్ భట్.. కార్యక్రమంలో కేటీఆర్ గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా కనిపించారు, వినిపించారు.

హైదరాబాద్ లో టీ-హబ్ 2.0 ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో బిర్యానీ నుంచి మొదలుపెట్టి, సోషల్ మీడియా వరకు చాలా విషయాలను సుదీర్ఘంగా వివరించారు కేటీఆర్. 34 నిముషాల ఆ సుదీర్ఘ ఇంటర్వ్యూ సారాంశం మీకోసం..ఇటీవల బీజేపీ నేతలు హైదరాబాద్ కి తరచూ వస్తున్నారని కామెంట్ చేసే సమయంలో.. హైదరాబాద్ రండి బిర్యానీ తినండి, ఇరానీ చాయ్ తాగి వెళ్లండి అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. కానీ, నిజ జీవితంలో కేటీఆర్ కి షాగౌస్ బిర్యానీ, అజీజ్ బిర్యానీ, బావర్చి, ప్యారడైస్ బిర్యానీ అంటే బాగా ఇష్టమట.. ఇప్పుడింకా కొత్త వెరైటీలు వచ్చి ఉంటాయని, కానీ తనకు తెలిసినంత వరకు అవే బాగా పాపులర్ అని చెప్పారు.లండన్ వెళ్లా.. కానీ రాణిని కలవలేదు..

ఇటీవల లండన్ టూర్ వెళ్లిన కేటీఆర్.. ఎలిజిబెత్ రాణిని కలవలేదని, ఆ విషయం తన కొడుకు తనని అడిగాడని కూడా చెప్పారు. తన కుమార్తెకు రైటింగ్, మ్యూజిక్ లో మంచి ప్రవేశం ఉందని అన్నారు. కుటుంబంతో గడిపే సమయం తనకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ఇంటికి వెళ్తే తాను మినిస్టర్ అనే హోదాని మరచిపోతానని, రాజకీయాల్లో లేదా ఇతర వృత్తుల్లో ఉన్న వారి జీవితాల్లో పర్సనల్ లైఫ్ తక్కువగా ఉంటుందని, దాన్ని ఆస్వాదించాలని అన్నారు. కొన్నేళ్ల ముందు తన పిల్లల కోసం స్కూల్ లో జరిగే పేరెంట్స్ మీటింగ్ లకు కూడా హాజరయ్యేవాడినని, ఇప్పుడు అవకాశం కుదరట్లేదని చెప్పారు.
తండ్రితో విభేదిస్తా కానీ..

కేసీఆర్ తో మీరెప్పుడైనా విభేదించారా.. అనే ప్రశ్నకు హుందాగా సమాధానమిచ్చారు కేటీఆర్. జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, కానీ కేసీఆర్ తనకు తండ్రి మాత్రమే కాదు బాస్ అని చెప్పారు. మీ బాస్ తో మీరెప్పుడైనా విభేదించారా అంటూ తన్మయ్ ని ప్రశ్నించారు. తన బాస్ తనకు ఏది చెబితే అది శిలా శాసనం అని అన్నారు. ఆ మాటకొస్తే తన కొడుకు కూడా కొన్ని సందర్భాల్లో తనతో విభేదిస్తాడని గుర్తు చేసుకున్నారు. తాను కేసీఆర్ లాగా ఉండలేనని, కానీ అలా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయన ఫస్ట్ జనరేషన్ వ్యక్తి అని, ఇప్పుడు ఆయన ఆ స్థానంలో ఉన్నారంటే.. దానికి కారణం పూర్తిగా ఆయనేనని చెప్పారు. తాను ఈ స్థానంలో ఉండటానికి కూడా కారణం ఆయనేనన్నారు. ఉద్యమం మొదలు పెట్టడం, పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడం.. అన్నీ ఆయన తనకు తానే సాధించగలిగారని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కేటీఆర్.తెలంగాణ విజయాలివే..

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత జీఎస్డీపీ రెట్టింపైందని చెప్పారు. వ్యవసాయ రంగంలో 119 శాతం పురోగతి సాధించామని, రాష్ట్రంలో 240 కోట్ల మొక్కలు నాటామని అన్నారు. వరల్డ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అని గూగుల్ లో టైప్ చేస్తే.. తెలంగాణ పేరు కనపడుతుందని, ఇది తాను చెప్పే మాట కాదని, రాష్ట్రంలో ప్రజల్ని అడిగినా, ఇంటర్నెట్ లో వెతికినా.. కనపడుతుందని చెప్పారు. భారత దేశానికి అత్యథిక ఆదాయం సమకూర్చుతున్న నాలుగో అదిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని అన్నారు కేటీఆర్.
ఎన్నికలప్పుడే పాలిటిక్స్.. ఆ తర్వాత ఎకనామిక్స్..

ఎన్నికలప్పుడు ఆరేడు నెలలు రాజకీయాలు చేస్తే చాలని, మిగతా నాలుగున్నరేళ్లు.. ప్రజల ఆర్థిక పరిస్థితి ఎలా పెంచాలా అని ఆలోచించాలని, కానీ భారత్ లో అది జరగడంలేదని అన్నారు కేటీఆర్. 1987 భారత్, చైనా.. ఆర్థిక పరిస్థితి 470 బిలియన్ డాలర్ల దగ్గర సమంగా ఉండేదని.. ప్రస్తుతం చైనా 16 ట్రిలియన్ డాలర్ల సంపద సృష్టిస్తే, భారత్ 5 ట్రిలియన్ డాలర్ల దగ్గర ఆగిపోయిందని చెప్పారు కేటీఆర్. చైనా ప్రభుత్వం సంపద సృష్టిపై దృష్టిసారిస్తే, మనం మాత్రం.. ప్రజలు ఏం ధరిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారనేదాని దగ్గరే ఆగిపోయామని చెప్పారు. ప్రస్తుతం భారత్ లో నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టం తాకిందని, ప్రపంచంలో గ్యాస్ సిలిండర్ల ధర భారత్ లోనే అత్యథికం అని చెప్పారు.
గోల్ మాల్ గుజరాత్ మోడల్..

తెలంగాణ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. గతంలో కూడా ఇలా ఒకరు రాష్ట్ర అభివృద్ధిని చూపించి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఇంటర్వ్యూ చేస్తున్న తన్మయ్ గుర్తుచేశారు. దీంతో సడన్ గా టాపిక్ మోదీ వైపు మళ్లింది. గతంలో గోల్ మాల్ గుజరాత్ మోడల్ తెరపైకి వచ్చిందని, కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో విద్యుత్ లేదు, నీళ్లు లేవు, ఉద్యోగాల్లేవు.. ఇంకా అదెక్కడి రోల్ మోడల్ అని ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు కేటీఆర్.

అమెజాన్ కంపెనీ తెలంగాణకు ఎలా వచ్చిందంటే..

గతంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానంలో వస్తున్నప్పుడు అమెజాన్ ప్రతినిధులు అనుకోకుండా తనను కలిశారని, బెంగళూరులో తమ బ్రాంచ్ ఓపెనింగ్ కి స్థానిక పన్నులతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారని, అప్పుడు తాను వారిని హైదరాబాద్ ఆహ్వానించానని చెప్పారు కేటీఆర్. అలా అమెజాన్ సంస్థ హైదరాబాద్ కి వచ్చిందని, ఇప్పుడు ప్రపంచంలోనే అమెజాన్ అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు. పెట్టుబడిదారులను భాగస్వాములుగా భావిస్తే ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు తరలివస్తాయని చెప్పారు. దావోస్ సదస్సులో మూడు రోజుల వ్యవధిలోనే తాను చాలామంది వ్యాపారవేత్తలను కలిశానని, అలా అందర్నీ విడివిడిగా కలవాలంటే దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని చెప్పారు. దావోస్ అనుభవాలను పంచుకున్నారు.
టీ-హబ్ నుంచి కేటీఆర్ ఏం ఆశిస్తున్నారు..?

విదేశాల్లో యూనివర్శిటీ స్థాయిలోనే స్టార్టప్స్ కి పునాది పడుతుందని, అక్కడ అలాంటి అవకాశాలుంటాయని చెప్పారు కేటీఆర్. భారత్ లో మాత్రం యూనివర్శిటీలు ఆ స్థాయిలో ఎద‌గ‌లేదని, అందుకే తాము స్టార్టప్స్ కోసం టీ-హబ్ నిర్మించామన్నారు. భారత్ లో యునికార్న్స్ లో 18శాతం మాత్రమే లాభాల్లో ఉన్నాయని గుర్తుచేశారు. స్టార్టప్స్ వస్తున్నాయి కానీ.. చాలా వరకు ఇతర సంస్థలను పోలినవి ఉంటున్నాయని, కొత్తగా వచ్చే స్టార్టప్స్ లో ప్రపంచస్థాయిని ఆకర్షించేవి ఉండాలనేది తన కల అని చెప్పారు. గూగుల్ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే, అందరూ ఆధారపడే స్టార్టప్ హైదరాబాద్ నుంచి మొదలు కావాలనేదే తన కోరిక అన్నారు.

సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తి..

తనలాంటి వారు సోషల్ మీడియా నుంచే వాస్తవాలు తెలుసుకోగలరని చెప్పారు కేటీఆర్. ఒక మంత్రి స్థాయిలో ఉన్నవారితో అందరూ వాస్తవాలు చెబుతారని అనుకోలేమని, అందుకే తాను గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోడానికి సోషల్ మీడియాపై ఆధారపడతానని, అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో.. అలాగే వాడుకోవాలని చెప్పారు.
అడుగడుగునా చమత్కారం..

గతంలో కేటీఆర్ ని ఇలా ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరేమో.. ఇంటర్వ్యూ మొదట్లోనే తనను తాను సర్ అని పిలిపించుకోడానికి ఇష్టపడనని చెప్పిన కేటీఆర్ సమాధానాలన్నిటికీ చమత్కారాన్ని జోడించారు. పూర్తిగా ఇంగ్లిష్, హిందీలోనే ఇంటర్వ్యూ సాగింది. ఆయన హావభావాలు కూడా కొత్తగా అనిపిస్తాయి. తెలంగాణలో కరోనా తర్వాత నైట్ లైఫ్ జోరు కాస్త తగ్గిందని అడిగిన ప్రశ్నకు.. నైట్ లైఫ్ తో పాటు డే లైఫ్ కూడా బాగుండాలి కదా అని చమత్కరించారు కేటీఆర్.

Next Story