Telugu Global
Telangana

అంతర్జాతీయ నాయకా..! ముందు అమేథీలో గెలువు

అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన సొంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు మంత్రి కేటీఆర్. రాహుల్ ముందుగా సొంత నియోజకవర్గ ప్ర‌జ‌ల్ని మెప్పించాలని, అక్కడ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

అంతర్జాతీయ నాయకా..! ముందు అమేథీలో గెలువు
X

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డంపై రాహుల్ గాంధీ సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టొచ్చు, లేదా ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని పోటీకి దింపొచ్చని వెటకారాలాడారు. బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్‌కి వచ్చిన నష్టమేమీ లేదన్నారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా బదులిచ్చారు మంత్రి కేటీఆర్. రాహుల్‌ని ఇంటర్నేషనల్ లీడర్ అంటూ సెటైర్లు పేల్చారు.

అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన సొంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు మంత్రి కేటీఆర్. జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను ఆయన ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా సొంత నియోజకవర్గ ప్ర‌జ‌ల్ని మెప్పించాలని, సొంత నియోజకవర్గం అమేథీలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు కేటీఆర్.

2019 ఎన్నికల్లో యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథీ నుంచి ఆయన ఓడిపోయినా వయనాడ్ నుంచి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే అమేథీ పరాజయం కాంగ్రెస్ పార్టీని ఇంకా కలచి వేస్తోంది. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గెలిచిన స్థానం అమేథీ. అది కాంగ్రెస్‌కి పెట్టనికోటలా ఉండేది. అలాంటి నియోజకవర్గంలో రాహుల్ 2019లో ఓడిపోవడం సంచలనంగా మారింది. ఆ విషయాన్ని ఇప్పుడు కేటీఆర్ ప్రస్తావిస్తూ ఆయన్ని ఇంటర్నేషనల్ నాయకుడంటూ సంబోధించారు. బీఆర్ఎస్‌పై సెటైర్లు పేల్చిన రాహుల్‌కి అంతకంటే ఘాటుగా బదులిచ్చారు కేటీఆర్.

First Published:  1 Nov 2022 7:16 AM GMT
Next Story