Telugu Global
Telangana

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల్ని భయపెట్టాలనుకుంటే అది రేవంత్ రెడ్డి భ్రమ అని అన్నారు కేటీఆర్. భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని, వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఈ ట్యాపింగ్ జరిగిందని, అధికారులు-నేతలు కుమ్మక్కై అప్పటి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉందని, వారికి చేతనైంది చేసుకోవాలని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడటం లేదని, యూట్యూబ్ లో లీకులు, మీడియాకు లీకులిస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వీరిఫోన్ ట్యాప్ అయింది, వారి ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారే కానీ.. అసలు విషయం మాత్రం బయట పెట్టడం లేదని విమర్శించారు కేటీఆర్.


వెంట్రుక కూడా పీకలేవు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల్ని భయపెట్టాలనుకుంటే అది రేవంత్ రెడ్డి భ్రమ అని అన్నారు కేటీఆర్. ట్యాపింగ్ విషయంలో ఎవరైనా విచారణ చేయొద్దన్నారా అని ప్రశ్నించారు. ఎవరు తప్పుచేశారు, తప్పులెక్కడ జరిగాయో అన్నీ బయటకు తీయాలన్నారు. భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని, వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు. ఇలాంటి వాటికి బీఆర్ఎస్ నేతలెవరూ ఆగం కావొద్దని చెప్పారు కేటీఆర్.

ఇదే విషయంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్పందించారు. ప్రణీత్‌రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారని, వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని చెప్పారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. తనను ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని అన్నారు ఎర్రబెల్లి.

బీజేపీ ఆరోపణలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు మొదలు పెట్టారు. గతంలో రేవంత్‌రెడ్డిని టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా అరెస్టు చేశారని, అంటే ఈ వ్యవహారం 2014 నుంచి జరిగినట్టు అర్థమవుతోందని చెప్పారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఈ కేసులో ఇద్దరు అడిషినల్‌ ఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, చిత్తశుద్ధితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఈ కేసులో ముద్దాయిలని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలన్నారు రఘునందన్ రావు.

First Published:  26 March 2024 12:58 PM GMT
Next Story