Telugu Global
Telangana

భారత్ జోడో.. రాహుల్ ఛోడో

కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని విమర్శించారు కేటీఆర్. ఎమ్మెల్సీల ఎంపికలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న లాలూచీ స్పష్టమైందని చెప్పారు.

భారత్ జోడో.. రాహుల్ ఛోడో
X

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని తిరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ ఛోడో అని వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు ఆ పార్టీని వీడి పోతున్నాయని విమర్శించారు. INDIA కూటమిలో చివరకు మిగిలేది రాహుల్ గాంధీ ఒక్కరేనన్నారు. ఢిల్లీలో మోదీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని.. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ పై మండిపడ్డారు.


పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, బీహార్‌లో నితీశ్‌ కుమార్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలాగే.. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు కేటీఆర్. మోదీని ఆపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల లీడర్లే అని స్పష్టం చేశారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బీజేపీ లీడర్లను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్‌లో వినిపించగలిగేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మద్దతివ్వాలని కోరారు.

కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని విమర్శించారు కేటీఆర్. ఎమ్మెల్సీల ఎంపికలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న లాలూచీ స్పష్టమైందని చెప్పారు. బీఆర్ఎస్ నేతల్ని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు వెనకాడిన గవర్నర్, కాంగ్రెస్ ఇచ్చిన లిస్ట్ ని మాత్రం యథాతథంగా ఆమోదించారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారాయన. కిషన్‌రెడ్డికి మరోసారి ఓటు అడిగే హక్కులేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కిషన్ రెడ్డి ఓడిపోతే ప్రజలు సింపతీతో సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించారని, కేంద్రమంత్రిగా ఆయన ఒక్క పని కూడా చేయలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

First Published:  27 Jan 2024 1:28 PM GMT
Next Story