Telugu Global
Telangana

ఉద్యమ నేతను కాపాడిన డాక్టర్లు వీరే..

కేసీఆర్‌కు వైద్యసేవలు అందించిన డాక్టర్లు శేషగిరిరావు, ప్రసాదరావు, శ్రీనివాస్‌ మంతా, దక్షిణామూర్తి, అజిత్‌ కు తెలంగాణ ప్రజల తరపున కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ వైద్య బృందం అందించిన సేవలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తూ కేటీఆర్‌ ఉద్వేగానికి లోనయ్యారు.

ఉద్యమ నేతను కాపాడిన డాక్టర్లు వీరే..
X

2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ ని జరుపుకుంటున్నాం. అయితే ఈ దీక్షా దివస్ లో కొంతమంది డాక్టర్లను కూడా గుర్తుంచుకోవాలి. వారే కేసీఆర్ ప్రాణాలు కాపాడారు. 11రోజుల ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్ ని తిరిగి ఆరోగ్యవంతుడిగా మార్చే క్రమంలో డాక్టర్ల సేవలు శ్లాఘనీయం. అందుకే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్. 2009లో నాటి ఉద్యమనేతగా కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్యసేవలు అందించిన నిమ్స్‌ వైద్య బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారాయన. దీక్షా దివస్‌ కార్యక్రమంలో వైద్య బృందానికి మంత్రి జ్ఞాపికలు బహూకరించి, సత్కరించారు.

2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష మొదలుపెట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న ఆయనను హైదరాబాద్‌ లోని నిమ్స్‌ కు తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆయన తన దీక్ష కొనసాగించారు. తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర అని డిసెంబర్-4న కేసీఆర్ ప్రకటించారు. అయినా కూడా కాంగ్రెస్ వెంటనే మెత్తబడలేదు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి, బంద్ లు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 9న కాంగ్రెస్ కోర్‌ కమిటీ ఐదుసార్లు సమావేశమై చివరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాతే కేసీఆర్ దీక్ష విరమించారు. 11 రోజుల సుదీర్ఘ దీక్షతో ఆయన ఆరోగ్యం పాడైంది. ఆయన్ను నిమ్స్ వైద్యులు కాపాడారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేశారు.

కేసీఆర్‌కు వైద్యసేవలు అందించిన డాక్టర్లు శేషగిరిరావు, ప్రసాదరావు, శ్రీనివాస్‌ మంతా, దక్షిణామూర్తి, అజిత్‌ కు తెలంగాణ ప్రజల తరపున కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ వైద్య బృందం అందించిన సేవలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తూ కేటీఆర్‌ ఉద్వేగానికి లోనయ్యారు. వారిని సన్మానించారు.


First Published:  30 Nov 2023 2:15 AM GMT
Next Story