Telugu Global
Telangana

రష్యా ఇచ్చిన ముడి చమురు రాయితీలు 35వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ? మోడీని ప్రశ్నించిన కేటీఆర్

ఇంధనంపై సెస్‌ను ఎత్తివేసి, ఇంధన ధరలను తగ్గించాలన్న తమ డిమాండ్ ను నిరాకరించిన కేంద్రం ఆయిల్ కంపెనీలకు మాత్రం విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గించిందని విమర్శించారు కేటీఆర్. మోడీ సర్కార్ కు ఈ దేశంలోని పేద ప్రజలకన్నా కార్పోరేట్ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ధ్వజమెత్తారు.

రష్యా ఇచ్చిన ముడి చమురు రాయితీలు 35వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ? మోడీని ప్రశ్నించిన కేటీఆర్
X

రష్యా నుంచి రాయితీపై ముడిచమురు దిగుమతుల వల్ల ఆదా అయిన రూ.35 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? లాభ పడ్డ ఆ రెండు కంపెనీలు ఏవి? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర సర్కార్ ను ప్రశ్నించారు. రష్యా మనకు ముడిచమురుపై ఇస్తున్న రాయితీ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన‌ మండిపడ్డారు.

ఇంధనంపై సెస్‌ను ఎత్తివేసి, ఇంధన ధరలను తగ్గించాలన్న తమ డిమాండ్ ను నిరాకరించిన కేంద్రం ఆయిల్ కంపెనీలకు మాత్రం విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గించిందని విమర్శించారు కేటీఆర్. మోడీ సర్కార్ కు ఈ దేశంలోని పేద ప్రజలకన్నా కార్పోరేట్ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ధ్వజమెత్తారు.

రష్యా నుంచి దిగుమతయ్యే రాయితీ ముడి చమురు వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోందని రామారావు వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. "మోదీ జీకి రిచ్ ఫ్రెండ్స్ మీద ఉన్న ప్రేమ భారతీయ పౌరుల మీద ఎందుకులేదు? అదనపు ఎక్సైజ్ డ్యూటీలు & సెస్‌ల తొలగింపు ద్వారా భారతీయులందరికీ ఉపశమనం కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నప్పుడు, NPA(నాన్ పరఫార్మెన్స్ అలియన్స్) ప్రభుత్వం ఇంధనంపై విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గించాలని నిర్ణయించింది." అని ఆయన చెప్పారు.

ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే విండ్ ఫాల్ టాక్స్ తగ్గింపువల్ల లాభాలు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో దేశానికి చెప్పాలన్నారు. రష్యా నుంచి రాయితీపై ముడి చమురు దిగుమతులకు పలువురు కేంద్రమంత్రులు పెద్దఎత్తున మద్దతు పలికారని, దీంతో రూ.35 వేల కోట్లు ఆదా అయ్యాయని ఆయన గుర్తు చేశారు. "కానీ దీని వల్ల సాధారణ భారతీయులు ప్రయోజనం పొంద లేదు. మోడీ ఫ్రెండ్లీ చమురు కంపెనీల జంట ఆ లాభం పొందింది? అని కేటీఆర్ ఆరోపించారు.

కాగా, విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఊహించని విధంగా, హటాత్తుగా ఏదైనా కంపెనీ అధికలాభాలు సాధిస్తే ఆ కంపెనీలపై వేసే టాక్స్. ఆ కంపెనీలకు సంబంధం లేని బైటి పరిస్థితుల వల్ల హటాత్తుగా అధిక లాభాలు పొందుతాయి. ప్రధానంగా చమురు కంపెనీలకు ఇలాంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో ఈ కంపెనీలు విపరీతంగా లాభాలు పొందాయి.

First Published:  17 Dec 2022 3:02 AM GMT
Next Story