Telugu Global
Telangana

వరంగల్ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందే..

ట్రైబల్ యూనివర్శిటీ ఎక్కడ? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెకానిక్ ఫ్యాక్టరీగా ఎందుకు మారింది..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వరంగల్ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందే..
X

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను ఉత్తుత్తి హామీలతో మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారని నిలదీశారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న మోదీ.. ముందుగా జిల్లా వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ ఎక్కడ? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెకానిక్ ఫ్యాక్టరీగా ఎందుకు మారింది..? అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నేడు పోడురైతులకు పండగ..

ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పోడు రైతులకు పండగ రోజని అన్నారు మంత్రి కేటీఆర్. 4.06 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తున్నామని, 1.50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24, 972 మంది రైతులకు 70, 434 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. జల్ జంగల్ జమీన్ అనే కొమురం భీం నినాదంతో అన్ని తండాలకు మంచినీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బిందెలు, కుండలు పట్టుకుని ఆడపడుచులు రోడ్డు పైకి వచ్చే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయిందని స్పష్టం చేశారు. హరిత హారం పేరుతో చెట్ల పెంపకంతో పాటు ఇప్పుడు గిరిజనుల అభివృద్ధి కోసం పోడు పట్టాలు పంపిణీ చేసి భూమి కూడా ఇస్తున్నామన్నాడు. గిరిజనులు, ఆదివాసీల రిజర్వేషన్లను 6నుంచి 10 శాతంకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులు ఇకపై రైతు బంధు, రైతు బీమాకు అర్హులని చెప్పారు మంత్రి కేటీఆర్.


తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత పాలన అందుబాటులోకి వచ్చింది చెప్పారు మంత్రి కేటీఆర్. 10 మంది డాక్టర్లు లేని మహబూబాబాద్ సర్కారు దవాఖానకు 110 మంది వైద్యులు వచ్చారన్నారు. ఆచర అమలు కాని హామీలతో కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

First Published:  30 Jun 2023 10:18 AM GMT
Next Story