Telugu Global
Telangana

మంత్రి హరీశ్ రావుపై వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్.. టికెట్లు రాని వారికి ఓదార్పు ఇస్తూ ట్వీట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరికి తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వలేదనే కోపంలో మంత్రి హరీశ్ రావును ఉద్దేశిస్తూ కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు నా దృష్టికి వచ్చిందని కేటీఆర్ చెప్పారు.

మంత్రి హరీశ్ రావుపై వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్.. టికెట్లు రాని వారికి ఓదార్పు ఇస్తూ ట్వీట్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ 114 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అధికార బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ఎంతో మంది ఆశావహులు ఉన్నా.. కేసీఆర్ మరోసారి సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. ఏడు మార్పులు తప్ప.. దాదాపు సిట్టింగ్స్ అందరికీ టికెట్లు దక్కాయి. టికెట్లు దక్కిన వారందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీతో ఎంతో కాలంగా ప్రయాణం చేస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న చాలా మంది ఈ సారి టికెట్లు ఆశించారు. పార్టీ హైకమాండ్‌తో సన్నిహితంగా ఉన్న వారికి కూడా టికెట్లు రాలేదు. దీంతో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు నిరాశకు గురయ్యారు. వాళ్లను అమెరికాలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు. వారికి స్వాంతన చేకూరే మాటలు చెప్పారు.

'బీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. నన్ను మరో సారి సిరిసిల్ల అభ్యర్థిగా ఎంపిక .చేసినందుకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ధన్యవాదాలు. అయితే చాలా మందికి టికెట్లు రాకపోవడంపై నిరాశ చెందాను. టికెట్లు రానివారిలో చాలా మంది అర్హత కలిగిన వారే ఉన్నారు. క్రిషాంక్ వంటి అర్హత కలిగిన నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ వారికి ఈ సారి టికెట్లు ఇవ్వలేకపోయారు. కానీ భవిష్యత్‌లో వారికి తప్పకుండా అవకాశాలు దక్కుతాయి. టికెట్లు నిరాకరించబడిన వారు తప్పకుండా భవిష్యత్‌లో ఎన్నికల రంగంలోకి దిగి.. ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది' అంటూ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.

హరీశ్ రావుపై కామెంట్లను ఖండించిన కేటీఆర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరికి తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వలేదనే కోపంలో మంత్రి హరీశ్ రావును ఉద్దేశిస్తూ కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు నా దృష్టికి వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అంతే కాకుండా మంత్రి హరీశ్ రావుకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా మొదటి నుంచి కొనసాగుతూ.. పార్టీకి ఒక మూల స్థంభంగా ఉన్న వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు చేయడం బాధకరమని కేటీఆర్ అన్నారు.


First Published:  21 Aug 2023 12:29 PM GMT
Next Story