Telugu Global
Telangana

పరిశ్రమల వివాదాలను గడువులోగా పరిష్కరించాలని కేటీఆర్ పిలుపు

హైదరాబాద్‌కు చెందిన అనేక ప‌రిశ్రమలు వివిధ న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా సాగిస్తున్న అంతులేని పోరాటాల వల్ల వాటి లాభాలు గణనీయంగా తగ్గడమే కాకుండా వారి సమయం, న్యాయవ్యవస్థ విలువైన సమయం కూడా వృధా అవుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

పరిశ్రమల వివాదాలను గడువులోగా పరిష్కరించాలని కేటీఆర్ పిలుపు
X

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంద‌ని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపార నాణ్యతను మెరుగుపరచడంతోపాటు వ్యాపార వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖర్చు, సమయం తగ్గింపు, మంచి సంపాదన, ఇవన్నీ పారిశ్రామిక సంబంధాలలో భాగం. ముందస్తు వివాద పరిష్కారాలతో పెట్టుబడిదారులు మరింత సంతృప్తి చెందే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించిందని హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) లో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.

Advertisement

హైదరాబాద్‌కు చెందిన అనేక ప‌రిశ్రమలు వివిధ న్యాయస్థానాల్లో సుదీర్ఘంగా సాగిస్తున్న అంతులేని పోరాటాల వల్ల వాటి లాభాలు గణనీయంగా తగ్గడమే కాకుండా వారి సమయం, న్యాయవ్యవస్థ విలువైన సమయం కూడా వృధా అవుతోందని మంత్రి అన్నారు.

“హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం చాలా ప్రయోజనకరంగా ఉంది. అంతర్జాతీయ కేంద్రం మంచి ఫలితాలను సాధించింది. దీని ద్వారా మరింత అవగాహన కల్పించాలని రిజిస్ట్రార్, ఇతర సిబ్బందిని నేను అభ్యర్థిస్తున్నాను” అని మంత్రి అన్నారు.

Advertisement

''హైదరాబాద్ లో ఈ కేంద్రం ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను తీసుకురాగలుగుతుంది. ఈ కేంద్రం కేవలం మెగా పరిశ్రమల కోసమే కాకుండా స్థానిక స్థాయిలో ఇబ్బందులు, అనేక వివాదాలను ఎదుర్కొనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ( MSME)లకు కూడా ఉపయోగపడుతుంది.'' అన్నారు కేటీఆర్

MSMEలకు సహాయం చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఒక ఫెసిలిటేషన్ న్యాయవాదితో పాటు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లలో వికేంద్రీకృత కౌన్సిల్‌లను ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు.

2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సింగపూర్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇతర దేశాలకు చెందిన వివిధ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్‌లో టీఎస్‌-ఐపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు.

“మేము పెట్టుబడిదారులకు వారి హక్కును అందించాలనుకుంటున్నాము. ఎనిమిదన్నర‌ సంవత్సరాలలో, ఈ పాలసీ ద్వారా 47 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద డేటా సెంటర్లు కూడా ఉన్నాయి” అని కేటీఆర్ చెప్పారు, అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని గుర్తుచేశారు. దీనికి 11 రోజుల్లో అన్ని అనుమతులు లభించాయని, అదే టీఎస్-ఐపాస్ విజయమని ఆయన అన్నారు.

సింగపూర్ నుండి భారతదేశం నేర్చుకోగల పాఠాలపై సింగపూర్ మాజీ అటార్నీ జనరల్ జస్టిస్ వికె రాజా మాట్లాడుతూ, "ఇది నా మొదటి హైదరాబాద్ సందర్శన. నన్ను ప్రభుత్వ విధానాలు చాలా ఆకట్టుకున్నాయి." అని అన్నారు. కోర్టులపై పార్టీలకు విశ్వాసం లేకపోతే మధ్యవర్తిత్వం పనిచేయదని, హైదరాబాద్‌ను లీగల్ హబ్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ మాట్లాడుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా గ్లోబల్ సెంటర్‌గా స్థిరపడేందుకు IAMC ప్రయత్నిస్తోందన్నారు. భారతదేశంలో వ్యాపారాలు ఇప్పటికీ ప్రభుత్వాల నీడలోనే ఉన్నాయి. వారు ఆ నీడ నుండి బయటపడి నిజమైన అర్థంలో కార్పొరేట్‌గా మారినప్పుడు, పార్టీలు సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటాయని, ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, సుపరిపాలనకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు.

Next Story