Telugu Global
Telangana

సివిల్స్ ర్యాంకర్లకు కేటీఆర్ శుభాకాంక్షలు

తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

సివిల్స్ ర్యాంకర్లకు కేటీఆర్ శుభాకాంక్షలు
X

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విజేతలను పేరు పేరునా ప్రస్తావిస్తూ ఆయన ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్.


తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం సంతోషకరమైన వార్త అన్నారాయన. 100 లోపు 4 ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్ కు, వారి తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు కేటీఆర్.

ప్రతిష్టాత్మక సివిల్స్ లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉందన్నారు కేటీఆర్. సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త అని అన్నారాయన. సివిల్ సర్వీసెస్ -2023 పరీక్షలో లక్నోకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ టాపర్ గా నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్ కి రెండో స్థానం లభించింది. ఈ సారి కూడా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. 100 లోపు నలుగురికి ర్యాంకులు వచ్చాయి. 200 లోపు ర్యాంకులు సాధించిన వారు తెలుగు రాష్ట్రాలనుంచి 11 మంది ఉండటం విశేషం.

First Published:  17 April 2024 9:16 AM GMT
Next Story