Telugu Global
Telangana

బీఆర్ఎస్ తుది జాబితా ఎప్పుడంటే..? కేటీఆర్ క్లారిఫికేషన్

ఈసారి కూడా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారని, దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఉంటాయని చెప్పారు కేటీఆర్. తాను గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానన్నారు.

బీఆర్ఎస్ తుది జాబితా ఎప్పుడంటే..? కేటీఆర్ క్లారిఫికేషన్
X

119 స్థానాల తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఫస్ట్ జాబితాలో 115మందికి చోటు దక్కింది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో లిస్ట్ లో 114 మందే ఉన్నారనుకోవాలి. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లు త్వరలో ప్రకటిస్తామన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికపై ఆయన ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇప్పటికే పార్టీ ప్రకటించిన 114మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పారాయన.

అభ్యర్థులకే దిక్కులేదు..

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకే దిక్కులేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. 40చోట్ల అభ్యర్థులే లేనప్పుడు 70చోట్ల ఆ పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ లో నోటుకి సీటు వ్యవహారం కూడా జోరుగా సాగుతోందన్నారు. కూకట్ పల్లి సీటుకోసం రూ.15కోట్లు బేరం పెట్టారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి రేపే వెళ్లి ఆహ్వానం పలుకుతానన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరతారని చెప్పారు. కాంగ్రెస్ లో టికెట్ ల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో ఫైటింగ్ సీన్ ఉంటుందని, కాంగ్రెస్ అంటే గందర గోళం, ఆగమాగం అని విమర్శించారు. కాంగ్రెస్ లో అప్పుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు తనకు సమాచారం ఉందన్నారు కేటీఆర్.

కర్నాటక అక్రమ సొమ్ము తెలంగాణకు..

కర్నాటక నుంచి అక్రమ సొమ్ము తెలంగాణకు వస్తోందని గతంలోనే తాను చెప్పానని, ఇప్పుడు అది రుజువైందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఎన్నికలకోసం కర్నాటకలో బిల్డర్లనుంచి చదరపు అడుగుకి 500 రూపాయలు బలవంతంగా కాంగ్రెస్ నేతలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. తమకంటే మెరుగైన పాలన నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టులన్నిట్లో తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉందన్నారు.

అసత్యాల అమిత్ షా..

అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని విమర్శించారు కేటీఆర్. తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి నిందలు వేస్తారని, ప్రధానికి అంత అహంకారమేంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, పక్కనవాళ్లు ఏది రాసిస్తే అది చదివే రీడర్ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు కేటీఆర్.

మా ప్రచారం ఎలా ఉంటుందంటే..?

ఈసారి కూడా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారని, దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఉంటాయని చెప్పారు కేటీఆర్. తాను గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానన్నారు. తమ ప్రోగ్రెస్ కార్డ్ ని ప్రజలముందు ఉంచుతామని చెప్పారు. కేసీఆర్ పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. గతం లో వచ్చినట్టే తమకు 88 సీట్లు రావచ్చు అన్నారు కేటీఆర్. ఈసారి హుజురాబాద్ లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో అంటూ సెటైర్లు పేల్చారు. షర్మిల 119 స్థానాల్లో పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు కేటీఆర్.

తమకి బీజేపీ, కాంగ్రెస్.. ఎవరితో పొత్తు లేదని తేల్చి చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీతో తమకు పొత్తు ఉంటే మైనారిటీ స్కూళ్ళు, కాలేజీ లు ఎందుకు పెడతామని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మోదీని తిట్టినంతగా ఇంకెవరూ తిట్టలేదని చెప్పారు. రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదన్నారు కేటీఆర్. కేవలం బీఆర్ఎస్ నేతల్నే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ఓపెన్ చేస్తే ఎవరు కాదంటారన్నారు. తమని గెలిపించేది అధికారులు కాదని, ప్రజలేనని చెప్పారు. అధికారుల బదిలీలను బదిలీలుగానే చూస్తామన్నారు కేటీఆర్.

First Published:  13 Oct 2023 2:16 PM GMT
Next Story