Telugu Global
Telangana

గేట్లు మూయండి.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డ్ ఆదేశం

గేట్లు మూయండి.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డ్ ఆదేశం
X

నాగార్జున సాగర్ వివాదంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్(KRMB) కీలక ఆదేశాలిచ్చింది. సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి KRMB సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్‌ నెల కోసం అడిగిన 5 టీఎంసీల కంటే ఎక్కువగా.. అంటే 5.01 టీఎంసీల నీటిని ఇప్పటికే తీసేసుకున్నారని, నవంబర్‌ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

పంపిణీ ఇలా..

నాగార్జున సాగ‌ర్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు 15 టీఎంసీల నీటి విడుద‌ల‌కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉంది. అక్టోబ‌ర్ 10 నుంచి 20వ తేదీ వ‌ర‌కు 5 టీఎంసీలు, జ‌న‌వ‌రి 8 నుంచి 18 వ‌ర‌కు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24వ తేదీ వ‌ర‌కు 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మూడు కోటాలు పూర్తయ్యాయని.. నవంబర్ 30న నీటి విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి వినతి అందలేదని KRMB అధికారులంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని, దీనిపై బోర్డ్ జోక్యం చేసుకోవాలని, దౌర్జన్యపూరితంగా ఏపీ చేపట్టిన నీటి తరలింపును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డ్ ని కోరింది. డ్యామ్‌ ఆక్రమణను తొలగించి, మొత్తం డ్యామ్‌ కంట్రోల్‌ ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు సాగర్ డ్యామ్ పై ఏపీ, తెలంగాణ పోలీస్ బలగాలు ఇరువైపులా మోహరించి ఉన్నాయి. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌ పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపితేనే భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తవని ఇతర పార్టీల నేతలంటున్నారు.


First Published:  1 Dec 2023 11:35 AM GMT
Next Story