Telugu Global
Telangana

10న కృష్ణా బోర్డు సమావేశం.. మరోసారి తెరపైకి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు?

సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది కూడా ఈ సారి చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.

కృష్ణా నది జలాల్లోని వాటాల పంపకాలపై ఈ నెల 10న మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన వాటాలో 50 శాతం నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. గత ఏడాది నుంచే దీనికి సంబంధించి పలు లేఖలు కూడా రాసింది. అయితే ఏపీ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ నెల 10న కృష్ణా నది యాజమాన్య బోర్డు మరోసారి సమావేశం నిర్వహించనున్నది. తెలంగాణ చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా ఈ సమావేశపు అజెండాలో చేర్చారు.

2022-23కు సంబంధించిన వాటర్ ఇయర్‌లో రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు చేయని బోర్డు.. ఈ సారి మాత్రం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులకు అజెండాను ముందుగానే పంపించింది. అయితే, ఇప్పటి వరకు ఉన్న 66:34 నిష్ఫత్తిలో పంపకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది. గతేడాది ఇదే డిమాండ్ బోర్డు ముందు పెట్టినా.. చివరకు దాన్ని బోర్డు చైర్మన్ విచక్షణకు వదిలేశారు.

తెలంగాణ అధికారుల నిర్లక్ష్యంపై గతంలోనే సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాన వాటా కోరాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగు నీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని కోరుతున్నది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో పాటు ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని అజెండాలో చేర్చారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌తో పాటు హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది కూడా ఈ సారి చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  6 May 2023 5:47 AM GMT
Next Story