Telugu Global
Telangana

వరంగల్‌కు కొరియా పరిశ్రమ.. 17న భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్

దక్షిణ కొరియాకు చెందిన వస్త్ర పరిశ్రమ యంగ్‌వన్ కేఎంటీపీలోని 298 ఎకరాల్లో రూ.840 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది.

వరంగల్‌కు కొరియా పరిశ్రమ.. 17న భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్
X

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)లో తమ యూనిట్ పెట్టడానికి దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ అనే సంస్థ నిర్ణయించి, గతంలోనే ఒప్పందం చేసుకున్నది. ఈ నెల 17న యంగ్ వన్ పరిశ్రమ నిర్మాణ పనులకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన వస్త్ర పరిశ్రమ యంగ్‌వన్ కేఎంటీపీలోని 298 ఎకరాల్లో రూ.840 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. యంగ్ వన్ సంస్థకు చెందిన పరిశ్రమలో సింథటిక్ జాకెట్స్, బూట్లు, ట్రాక్ సూట్ల, ట్రెక్కింగ్‌కు ఉపయోగించే దుస్తులను ఉత్పత్తి చేస్తారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ఇప్పటికే కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ ఒక పరిశ్రమను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ పరిశ్రమ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కీటెక్స్ సంస్థ రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నది. ఆ తర్వాత ఆ పెట్టుబడిని రూ.3వేలకు పెంచుతూ ప్రకటన చేసింది. ఈ సంస్థ ద్వారా 28 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

కీటెక్స్ సంస్థ కేఎంటీపీతో పాటు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో కూడా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. సీతారాంపూర్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. అలాగే రూ.600 కోట్లతో పిల్లల సాక్స్ తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయనున్నది. రంగారెడ్డి జిల్లాలోని యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ ప్రారంభం అయితే రోజుకు 2.5 మిలియన్ల పిల్లల దుస్తులు ఉత్పత్తి అవుతాయని కీటెక్స్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

First Published:  11 Jun 2023 1:55 AM GMT
Next Story