Telugu Global
Telangana

తమ్ముడి కోసం తెర వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు

ఒకవైపు తమ్ముడికి సపోర్ట్ చేయలేక, మరోవైపు తమ్ముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరవెనుకే మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

తమ్ముడి కోసం తెర వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు
X

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్ని రోజులుగా బయట ఎవరికీ కనిపించడం లేదు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక ఆయన ఇంటికే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడం వల్లే ఇప్పుడు ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీలో చేరడంతో వెంకటరెడ్డి సైలెంట్ అయిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు తమ్ముడికి సపోర్ట్ చేయలేక, మరోవైపు తమ్ముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయలేక ఆయన తెరవెనుకే మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భువనగిరి లోక్‌సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింటిలో టీఆర్ఎస్ గెలిచింది. కేవలం మునుగోడులోనే కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎంపీగా వెంకటరెడ్డి గెలిచారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న పట్టే వారిద్దరినీ గెలిపించిందనేది అక్షర సత్యం. ఇక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఒకవైపు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీజేపీపై శంఖారావం పూరించారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకమైన వెంకటరెడ్డి మాత్రం సైలెంట్ అయ్యారు.

కాగా, వెంకటరెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్ ప్రచారానికి రాకపోయినా.. తమ్ముడికి మాత్రం తెరవెనుక మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో ఓడిపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇరకాటంలో పడుతుంది. అలా అని బహిరంగంగా ప్రచారం చేయలేక తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని మునుగోడులో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మొదటి నుంచి ఉన్న విభేదాల వల్ల కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. కాంగ్రెస్‌లో ఉన్న తన అనుచరులు, ఇతర ముఖ్య నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ తమ్ముడు రాజగోపాల్‌కు ఓట్లు వేయించాల్సిదా కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓ మండల అధ్యక్షుడికి నేరుగా కాల్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయించాలని కోరడంతో ఆయన ఎదురు తిరిగారని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలా చేయడం భావ్యం కాదని ముఖం మీదే చెప్పినట్లు తెలుస్తోంది.

సదరు మండల అధ్యక్షుడు ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పడంతో వాళ్లు కూడా అప్రమత్తమ‌య్యారు. ముఖ్యనేతలకు కాల్ చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దసరా తర్వాత చౌటుప్పల్‌లో సమావేశం ఏర్పాటు చేద్దామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉపఎన్నికలో కష్టపడి పని చేసిన వాళ్లకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కంటే తమ్ముడి కోసమే తెరవెనుక పని చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

First Published:  4 Oct 2022 1:13 PM GMT
Next Story