Telugu Global
Telangana

ముందుగానే దిగ్విజయ్ కి కోమటిరెడ్డి ఫిర్యాదులు..!

దిగ్విజయ్ ఇలా హైదరాబాద్ లో అడుగు పెట్టారో లేదో, అలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి కలిశారు. తాజ్ కృష్ణ హోటల్ లో ఆయన్ను కలిసిన వెంకట్ రెడ్డి దాదాపు 40నిముషాల సేపు మంతనాలు సాగించారు.

ముందుగానే దిగ్విజయ్ కి కోమటిరెడ్డి ఫిర్యాదులు..!
X

మునుగోడు ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కాక పెరిగింది. ఆ తర్వాత కమిటీల నియామకంతో ఆ గొడవ మరింత ముదిరి పాకానపడింది. అసలు నేతలు వర్సెస్ వలస నేతలు అంటూ స్పష్టంగా ఓ విభజన రేఖను గీసేశారు సీనియర్లు. మూకుమ్మడిగా 12మంది పీసీసీ పదవులకు రాజీనామాలు చేయడంతో అధినాయకత్వం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. దిగ్విజయ్ ఇలా హైదరాబాద్ లో అడుగు పెట్టారో లేదో, అలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి కలిశారు. తాజ్ కృష్ణ హోటల్ లో ఆయన్ను కలిసిన వెంకట్ రెడ్డి దాదాపు 40నిముషాల సేపు మంతనాలు సాగించారు.

సంజాయిషీనా..? ఫిర్యాదులా.. ?

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చింది. అప్పట్లో ఆయన సమాధానం చెప్పారు కూడా. ఆ తర్వాత పీసీసీ కమిటీల విషయంలో వెంకట్ రెడ్డిని అధిష్టానం పూర్తిగా పక్కనపెట్డంతో కాంగ్రెస్ లో ఇక కోమటిరెడ్డి కుటుంబ ప్రస్థానం ముగిసినట్టేనని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ని వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు వెంకట్ రెడ్డి. గతంలో జరిగిన ఘటనలకు ఆయన సంజాయిషీ ఇచ్చారా.. లేక స్థానిక నాయకత్వంపై ఫిర్యాదులు చేశారా అనేది తేలాల్సి ఉంది.

ఏం చెప్పానంటే..?

దిగ్విజయ్ సింగ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి అస్పష్టంగానే వివరాలు వెల్లడించారు. అధికారిక భేటీకి తాను అందుబాటులో ఉండటంలేదని, అందుకే ముందస్తుగా దిగ్విజయ్ సింగ్ ని కలిశానంటున్నారు వెంకట్ రెడ్డి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించానని చెప్పారు. పీసీసీ కమిటీలతో పాటు ఇతర అంశాలపై చర్చించానని అన్నారు. దిగ్విజయ్ తనకు కొన్ని సూచనలు చేశారని, తన ఆలోచనలను వారితో పంచుకున్నానని చెప్పారు. త్వరలో ఢిల్లీ వెళ్లి.. అక్కడ ఆయనతో కూర్చుని మాట్లాడతానన్నారు వెంకట్ రెడ్డి.

First Published:  22 Dec 2022 6:50 AM GMT
Next Story