Telugu Global
Telangana

కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు.. కోమటిరెడ్డి ఆసక్తికర సమాధానం

రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ధీమాగా చెబుతున్నారు కోమటిరెడ్డి.

కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు.. కోమటిరెడ్డి ఆసక్తికర సమాధానం
X

కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని, వారు తెలంగాణ ప్రభుత్వం పుట్టి ముంచుతారని.. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటీవల బీజేపీ కూడా ఇదే బాటలో కాంగ్రెస్ కి కౌంటర్లిస్తోంది. రేవంత్ ప్లాన్-ఎ, ప్లాన్-బి ఏంటో కూడా బీజేపీ నేతలు వివరించారు. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండేలు అంటూ వైరి వర్గాలు చేస్తున్న కామెంట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి బీజేపీలబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనం అని చెప్పారు.

పదేళ్లు గ్యారెంటీ..

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పెద్దగా సఖ్యత లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గోలిచి, రేవంత్ సీఎం అయిన తర్వాత కోమటిరెడ్డిలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ధీమాగా చెబుతున్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్‌లో ఏకనాథ్ షిండేలు ఎవరూ లేరని.. హస్తం పార్టీలో గ్రూపులు లేవని క్లారిటీ ఇచ్చారు. తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

అసలు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టిందే బీజేపీ అని విమర్శించారు కోమటిరెడ్డి. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్‌లు బంద్ చేయాలన్నారు. బీఆర్ఎస్ కి ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీసీటు కూడా రాదని జోస్యం చెప్పారు వెంకట్ రెడ్డి. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నా తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

First Published:  11 April 2024 7:08 AM GMT
Next Story