Telugu Global
Telangana

అన్న‌ను ఇరకాటంలో పెట్టిన రాజగోపాల్ రెడ్డి..

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోవర్ట్‌ అని, కాంగ్రెస్‌ లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 24 గంటల వ్యవధిలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోకపోతే, తామంతా కాంగ్రెస్‌ కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీచేశారు.

అన్న‌ను ఇరకాటంలో పెట్టిన రాజగోపాల్ రెడ్డి..
X

ఇటీవల ఓ టీవీ డిబేట్ లో నోరుజారి నిజాలన్నీ బయటపెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మూడేళ్లుగా తాను బీజేపీతో టచ్ లో ఉన్నానని, కానీ ఆరు నెలల క్రితమే తనకు 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఓకే అయిందని చెప్పారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఓకే అయ్యాకే ఆయన రాజీనామా చేయడం, పార్టీ మారడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టయింది. దీంతో ఇప్పుడు అనూహ్యంగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి కోవర్టుగా వ్యవహరిస్తుంటే వెంకట్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నలు వినపడుతున్నాయి. వెంకట్ రెడ్డి కూడా కోవర్టేనని, ఆయనను పార్టీనుంచి బహిష్కరించాలంటూ మునుగోడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వెంకట్ రెడ్డి ఎక్కడ..?

మునుగోడుకి స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఇవ్వలేదని ఆమధ్య అలిగిన వెంకట్ రెడ్డి, ఆ తర్వాత అధిష్టానం ఆ పోస్ట్ ఇవ్వడంతో సంబరపడ్డారు. కానీ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. అభ్యర్థిని నిలబెట్టడంలో చూపించిన శ్రద్ధ, ఆ తర్వాత ప్రచారంలో లేదు. ఓ వ్యూహం ప్రకారమే వెంకట్ రెడ్డి తన త‌మ్ముడు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారనే వాదన కూడా వినపడుతోంది. దీనికి మరింత బలాన్ని చేకూర్చేలా ఇటీవల రాజగోపాల్ రెడ్డి కూడా స్టేట్ మెంట్లు ఇచ్చారు. అన్న సపోర్ట్ తనకేనని అన్నారు. అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే ఉన్న వెంకట్ రెడ్డి, తనతోపాటు, కాంగ్రెస్ లో తనకి అనుకూల వర్గంగా ఉన్నవారందరి ఓట్లను రాజగోపాల్ రెడ్డికి వేయించబోతున్నారనేది నిజం. అందుకే కాంగ్రెస్ లో ఇప్పుడు వెంకట్ రెడ్డి కార్నర్ అవుతున్నారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోవర్ట్‌ అని, కాంగ్రెస్‌ లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 24 గంటల వ్యవధిలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోకపోతే, తామంతా కాంగ్రెస్‌ కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాక రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయలేదని, కుటుంబానికి సరిపడా నిధులు సమకూర్చుకోవడానికే ఆయన రాజీనామా చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అవకాశం దొరికితే తెలంగాణ మొత్తాన్ని అమ్మేస్తారని విమర్శించారు.

First Published:  9 Oct 2022 10:54 AM GMT
Next Story