Telugu Global
Telangana

అంతా గప్ చుప్.. రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదు

రాజగోపాల్ గురించి తనకు తెలియదన్న వెంకట్ రెడ్డి.. తానెప్పుడూ తన సోదరుడితో రాజకీయాలు మాట్లాడనని జోక్ పేల్చారు.

అంతా గప్ చుప్.. రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదు
X

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుంది. లేకపోతే ఢిల్లీలో మీటింగ్ తర్వాత ఎవరకు వారే టీవీ ఛానళ్లను పిలిచి ఇంటర్వ్యూలిచ్చేవారు, ఆహా ఓహో అని చెప్పుకునేవారు. తెలంగాణలో ఎన్నిసీట్లు గెలుస్తామో చెప్పేసేవారు. కానీ అదేదీ జరగలేదు, కనీసం టీవీ ఛానళ్లలో కూడా కాంగ్రెస్ మీటింగ్ గురించి చర్చ మొదలు కాలేదంటే నాయకులెవరూ అందుబాటులోకి వెళ్లలేదని అర్థమవుతోంది. మీడియాకు లీకులివ్వడంలో ఉత్సాహంగా ఉండే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో నోరు మెదపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదు..

రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకొచ్చేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు వెంకట్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ కుటుంబం పట్టు తగ్గకుండా చూస్తున్నారు. అధిష్టానం వద్ద కూడా ఆయన మంతనాలు సాగించారు. కానీ రాహుల్ పెట్టిన కండిషన్ వల్ల ఆయన గప్ చుప్ గా ఉన్నారు. రాజగోపాల్ గురించి తనకు తెలియదన్న వెంకట్ రెడ్డి.. తానెప్పుడూ తన సోదరుడితో రాజకీయాలు మాట్లాడనని జోక్ పేల్చారు. బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు ఇవ్వాలని తాను అధిష్టానాన్ని కోరానని చెప్పుకొచ్చారు. ఈసారి తాను ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటున్నానని అన్నారు ఎంపీ వెంకట్ రెడ్డి.

టీకాంగ్ యాక్షన్ ప్లాన్..

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు ఈ మీటింగ్ తో తేలిపోయింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉందని, త్వరలో యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాలని నాయకులకు అధినాయకత్వం ఉపదేశించింది. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని రాహుల్ గాంధీ మీటింగ్ లో మాటిచ్చారు. ఇక సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తారని, ఈ వారం ఎలక్షన్ కమిటీ వేస్తారని తెలుస్తోంది. త్వరలోనే కొన్ని స్థానాల్లో టికెట్లు ఖరారు చేసి అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటిస్తారని అంటున్నారు.

First Published:  28 Jun 2023 1:42 AM GMT
Next Story