Telugu Global
Telangana

బీజేపీకి టీడీపీ మద్దతు.. చంద్రబాబును కలవనున్న రాజగోపాల్ రెడ్డి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కొందరు టీటీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. మునుగోడులో గెలుపు కీలకం కావడంతో బీజేపీ కూడా తెలుగుదేశంతో మద్దతుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

బీజేపీకి టీడీపీ మద్దతు.. చంద్రబాబును కలవనున్న రాజగోపాల్ రెడ్డి?
X

మునుగోడు ఉపఎన్నిక బీజేపీకి తలకు మించిన భారంగా మారింది. మొదట్లో గెలుపు తమదే అని భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసిన తర్వాత రాష్ట్ర సీనియర్ నాయకులు చేతులెత్తేశారు. ఇక బరిలో దిగిన తర్వాత తప్పదు కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు మద్దతు ఇచ్చినా సాదరంగా ఆహ్వానించేందుకు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నది. కాగా, ఏపీలో అధికారం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలిన భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో దూరమైన బీజేపీని.. టీడీపీకి దగ్గర చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఎన్నిక బీజేపీని దగ్గర చేసుకోవడానికి చంద్రబాబుకు మంచి అవకాశానన్ని ఇచ్చింది.

మునుగోడులో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తోంది. ఒక్క ఓటును కూడా వదులుకోవడానికి పార్టీలు సిద్ధంగా లేవు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి మునుగోడు నుంచి బరిలో దిగాలని టీటీడీపీ చంద్రబాబుపై ఒత్తిడి చేసింది. పార్టీ ఇంచార్జి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, ఒక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చిన ఉపఎన్నికలో మనం బరిలోకి దిగడం మంచిది కాదని తేల్చి చెప్పేశారు. వచ్చే అసెంబ్లీ నాటికి తెలంగాణలో బలపడి బరిలోకి దిగుదాం అని నాయకులకు వివరించారు. అయితే అనూహ్యంగా టీడీపీ మద్దతు కోసం రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. కోమటిరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి టీడీపీ అంటే పడదు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ మద్దతు తనకు తప్పని సరి అని భావించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కొందరు టీటీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. మునుగోడులో గెలుపు కీలకం కావడంతో బీజేపీ కూడా తెలుగుదేశంతో మద్దతుకు ఓకే చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి అనుకూలంగానే ఉన్నారు. దీంతో ఇవ్వాళో, రేపో చంద్రబాబును కలవడానికి రాజగోపాల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరి మధ్య చర్చల అనంతరం మునుగోడు విషయంలో అధికారికంగా మద్దతు ప్రకటన వచ్చే అవకాశం ఉన్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇచ్చింది. ఈ పొత్తును కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ, చంద్రబాబు మద్దతు కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్రంగా విమర్శించారు. బహిరంగంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారాయి. కానీ, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మద్దతు కోసం చంద్రబాబును కలవనుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనదాకా వస్తే కానీ రాజకీయం అర్థం కాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఆనాడు చంద్రబాబును తిట్టిన వ్యక్తే ఇవ్వాళ ఆయన మద్దతు కోసం వెంపర్లాడటం ఏంటని అంటున్నారు. మునుగోడులో టీడీపీ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో తెలియదు. కానీ, ఒక రకంగా ఇది టీఆర్ఎస్ పార్టీ నెత్తిన పాలుపోసినట్లే అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర ఉన్నది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉపయోగించుకునే వీలుంది.

చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరయ్యే అవకాశం దొరికిందనే మద్దతుకు ఓకే చెప్తున్నారనేది బహిరంగ రహస్యమే. అందుకే అప్పట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ తనను తిట్టిన తిట్లన్నీ మరిచిపోయి మునుగోడులో సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. చంద్రబాబు రాజకీయం గురించి తెలిసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించక పోయినా.. మునుగోడు ఓటర్లకు మాత్రం ఎటు ఓటేయాలనే విషయాన్ని తేల్చుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

First Published:  15 Oct 2022 11:11 AM GMT
Next Story