Telugu Global
Telangana

ఆఖరికి ఫేక్ ఓటు వేసే స్థాయికి దిగజారిన రాజగోపాల్

కనీసం ఆయన గుర్తింపు కార్డులేవీ సిబ్బందికి చూపించలేదు. ఆయన వేలుకి ఇంక్ మార్క్ కూడా లేదు. సిబ్బందితో మాట్లాడి కాసేపు ఈవీఎం దగ్గరకు వెళ్లి ఓటు వేసినట్టు నటించారు.

ఆఖరికి ఫేక్ ఓటు వేసే స్థాయికి దిగజారిన రాజగోపాల్
X

సరిగ్గా మునుగోడు పోలింగ్ టైమ్ కి కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరాడని, కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి, కేసీఆర్ ని కలిశారంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన బీజేపీ.. చివరికి ఫేక్ ఓటుకి కూడా దిగజారింది. అదేంటి ఫేక్ ఓటు అనే పదమే కొత్తగా ఉందనుకుంటున్నారా..? అవును, మీరు విన్నది నిజమే.. అది దొంగఓటు కాదు, ఫేక్ ఓటు. ఆ ఫేక్ ఓటు వేసింది కూడా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావడం విశేషం.

ఓటు లేకుండా ఓటు వేయొచ్చా..?

రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఓటు హక్కు లేదు. ఆయనకు నకిరేకల్ లో ఓటు ఉన్నట్టు ఆయనే స్వయంగా ఎన్నికల కమిషన్ కి అఫిడవిట్ ఇచ్చారు. నామినేషన్ రోజు ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. అప్పటినుంచే టీఆర్ఎస్ నేతలు.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఓటు కూడా లేదంటూ ప్రచారంలో విమర్శించారు. కానీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం నిజంగానే విచిత్రం.



సినిమా చూపించారు..

ఓటు లేని రాజగోపాల్ రెడ్డి మునుగోడు పట్టణ శివాలయంలో పూజ చేసి మరీ పోలింగ్ బూత్ కి వెళ్లారు. బయట మీడియా హడావిడితో ఆయన అందరికీ అభివాదం చేస్తూ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ పోలింగ్ సిబ్బందికి ఏవేవో జాగ్రత్తలు చెప్పారు. కనీసం ఆయన గుర్తింపు కార్డులేవీ సిబ్బందికి చూపించలేదు. ఆయన వేలుకి ఇంక్ మార్క్ కూడా లేదు. సిబ్బందితో మాట్లాడి కాసేపు ఈవీఎం దగ్గరకు వెళ్లి ఓటు వేసినట్టు నటించారు. ఆ తర్వాత తన దారిన తాను బయటకు వెళ్లారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లారు కానీ ఓటు వేశారని ఆయన చెప్పలేదు కదా అనుకునేరు.. ఆయనే తాను ఓటు వేసినట్టు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోలను పోస్ట్ చేశారు. చివరకు వేలికి ఇంకు చూపించలేక పోలింగ్ కేంద్రం నుంచి చల్లగా జారుకున్నారు.

ఇంతకీ నకిరేకల్ లో ఓటు ఉన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎలా ఓటు వేశారు..? ఓటు వేయడానికి సిబ్బంది ఆయన్ను ఎలా అనుమతించారు..? ఓటు వేయకపోయినా వేసినట్టు ట్విట్టర్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫేక్ ఓటు వ్యవహారం తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైనే ఉంది. ఫేక్ ఓటు వేసిన రాజగోపాల్ తన తప్పు ఒప్పుకుంటారా.. లేక ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేంత వరకు వెయిట్ చేస్తారా.. వేచి చూడాలి.

First Published:  3 Nov 2022 10:53 AM GMT
Next Story