Telugu Global
Telangana

మునుగోడు గాయం మానిందా..? అధిష్టానం తలంటిందా..?

కాంట్రాక్ట్ ల కోసం పార్టీ మారి మునుగోడుకి రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చిన రాజగోపాల్ రెడ్డి, తన అవసరం తీరిపోగానే కొన్నాళ్లు బీజేపీతో అంటీ ముట్టనట్టు ఉన్నారు. అయితే హైకమాండ్ మందలించడంతోనే ఆయన మహబూబ్ నగర్ లో బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారని తెలుస్తోంది.

మునుగోడు గాయం మానిందా..? అధిష్టానం తలంటిందా..?
X

మునుగోడు పరాభవం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరమరుగయ్యారు. బీజేపీ వ్యవహారాల్లో కూడా ఆయన అంత చురుగ్గా లేరు, పార్టీ కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇన్నాళ్లకి మళ్లీ రాజగోపాల్ రెడ్డి తెరపైకి వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా ఎదుగుతోందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిజంగానే ఎదుగుతుంటే.. మునుగోడులో ఎందుకు మునిగిపోయిందో చెప్పాలి కదా. ఆ ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర బదులు లేదు.

మహబూబ్‌ నగర్‌ రూరల్‌ మండలంలోని కోడూరు, హన్వాడలో జరిగిన బూత్‌ కమిటీ సభ్యుల సమావేశాల్లో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడంలేదని తెలిపారు.

కుటుంబ పాలన..

కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమే. అన్నదమ్ములిద్దరూ నియోజకవర్గాల్ని పంచుకున్నారు, చివరకు పార్టీలను పంచుకున్నారు. కోమటిరెడ్డి కుటుంబంలో లేని కుటుంబ పాలన రాష్ట్రంలో ఉందని రాజగోపాల్ రెడ్డి మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆయన మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. దక్షిణ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని మరోసారి జబ్బలు చరుచుకున్నారు.

నెత్తిమీద రూపాయి పెడితే కూడా ఎవరూ కొనుక్కోలేని వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయ్యారని, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ఆయన గెలిచారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. ప్రజలు సామాజిక తెలంగాణను కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమన్నారు. కేవలం కాంట్రాక్ట్ ల కోసం పార్టీ మారి మునుగోడుకి రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చిన రాజగోపాల్ రెడ్డి, తన అవసరం తీరిపోగానే కొన్నాళ్లు పార్టీతో అంటీ ముట్టనట్టు ఉన్నారు. అయితే హైకమాండ్ మందలించడంతోనే ఆయన మహబూబ్ నగర్ లో బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారని తెలుస్తోంది.

First Published:  6 Jan 2023 1:06 AM GMT
Next Story