Telugu Global
Telangana

నన్ను నమ్మండి ప్లీజ్.. బీజేపీ టికెట్ పైనే పోటీ చేస్తా

చౌటుప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి మీడియా అడగకపోయినా తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నన్ను నమ్మండి ప్లీజ్.. బీజేపీ టికెట్ పైనే పోటీ చేస్తా
X

ఎలక్షన్ డేట్ వచ్చాక కూడా తెలంగాణలో గోడ దూకుళ్లు, కప్పదాట్లు ఆగలేదు. దీంతో అసలు ఎవరెవరు, ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో నామినేషన్ వేసే వరకు ఖాయం కాని పరిస్థితి. ఈ క్రమంలో తన పాతివ్రత్యాన్ని శంకించొద్దంటూ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను మునుగోడు నియోజకవర్గం నుంచి ఖాయంగా బీజేపీ టికెట్ పైనే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు.

ఎందుకీ అనుమానం...?

మునుగోడులో ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హడావిడిగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున ఉప ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆయన ఉత్తి పుణ్యానికి తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ ల రూపంలో బాగానే ముట్టిందనుకోండి. అయితే రాజకీయంగా తనకు బీజేపీ లాభసాటి కాదు అనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ సభకు కూడా రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ అనుమానం మరింత బలపడింది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డిని బీజేపీ బుజ్జగించేందుకు ఓ పదవిని ఎరవేసింది. బీజేపీ స్క్రీనింగ్ కమిటీకి ఆయనను చైర్మన్ గా ప్రకటించింది. అయినా కూడా రాజగోపాల్ రెడ్డిపై అనుమానాలు తొలగిపోలేదు.

నన్ను నమ్మండి..

రాజగోపాల్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా.. ఆయన్ను మీడియా ఇదే విషయంలో ప్రశ్నిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉంటారా, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారా అని అడుగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాలంటూ ఆయన విసుక్కుంటున్నా.. పదే పదే క్లారిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా చౌటుప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి మీడియా అడగకపోయినా తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా తాను మునుగోడు బరిలోనే ఉంటానని, బీజేపీ తరపునే పోటీ చేస్తానన్నారు. ఉప ఎన్నికల్లో కూడా తనదే నైతిక విజయం అని చెప్పుకొచ్చారు. కొందరు కుట్రపూరితంగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.

First Published:  15 Oct 2023 1:47 PM GMT
Next Story