Telugu Global
Telangana

కాంగ్రెస్ ఎదురుదాడి.. డీఎస్సీకోసం కోమటిరెడ్డి ఉద్యమం

ఉచిత విద్యుత్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజీ కావడంతో కోమటిరెడ్డి కాస్త ఉధృతంగా తెరపైకి రావాలని చూస్తున్నారు. డీఎస్సీ ఉద్యమం పేరుతో కోమటిరెడ్డి హడావిడి చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎదురుదాడి.. డీఎస్సీకోసం కోమటిరెడ్డి ఉద్యమం
X

ఉచిత విద్యుత్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని నష్టం జరిగింది, జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తున్నారు నాయకులు. రుణమాఫీకోసం రైతులతో బ్యాంకుల ముందు ఉద్యమం చేయించాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అయితే ఇక్కడ కూడా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాట మొదలైంది. రేవంత్ రెడ్డి రైతు ఉద్యమం చేస్తానంటుంటే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తానంటూ ముందుకొచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఆయన సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు.

ప్రగతి భవన్ ముట్టడిస్తాం..

వారం రోజుల్లో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లక్షల మంది నిరుద్యోగుల అవస్థలు చూడలేకే తాను ఈ ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్టు పేర్కొన్నారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కోమటిరెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. టీచర్ పోస్టుల భర్తీ అంశంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఉపాధ్యాయ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని, ఇప్పటికే పలుమార్లు టెట్‌ రాసి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని, అయినా డీఎస్సీ వేయడంలో జాప్యం ఎందుకని అడిగారు. రాష్ట్రంలో వేలసంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిటైర్‌ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని, వారి స్థానాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు కోమటిరెడ్డి.

ఉచిత విద్యుత్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజీ కావడంతో కోమటిరెడ్డి కాస్త ఉధృతంగా తెరపైకి రావాలని చూస్తున్నారు. డీఎస్సీ ఉద్యమం పేరుతో కోమటిరెడ్డి హడావిడి చేస్తున్నారు. రైతు వేదికల వద్ద తీర్మానాల పేరుతో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తే, డీఎస్సీ పేరుతో ఎదురుదాడికి సిద్ధమయ్యారు కోమటిరెడ్డి.

First Published:  18 July 2023 12:11 PM GMT
Next Story