Telugu Global
Telangana

అన్నకు 'సీన్' అర్థ‌మైపోయిందా ?

ఇదే సమయంలో ఉప ఎన్నిక ప్రచారంలో ఎదురుదెబ్బలు తింటున్న తమ్ముడిని అలా వదిలేయలేకపోతున్నారు. అందుకనే పార్టీలోని తమ మద్దతుదారులతో సీక్రెట్ గా మంతనాలు ప్రారంభించారు.

అన్నకు సీన్ అర్థ‌మైపోయిందా ?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీన్ అర్థ‌మైపోయిందా ? అందుకనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళిపోయారా..? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపున‌కు స్వయానా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తమ్ముడి గెలుపున‌కు బహిరంగంగా పనిచేయలేకపోతున్నారు.

ఇదే సమయంలో ఉప ఎన్నిక ప్రచారంలో ఎదురుదెబ్బలు తింటున్న తమ్ముడిని అలా వదిలేయలేకపోతున్నారు. అందుకనే పార్టీలోని తమ మద్దతుదారులతో సీక్రెట్ గా మంతనాలు ప్రారంభించారు. తాజాగా ఓ మద్దతుదారుడికి వెంకటరెడ్డి ఫోన్ చేసి తన తమ్ముడు గెలుపున‌కు పనిచేయాలని రిక్వెస్టు చేసిన ఆడియో కలకలం సృష్టించింది. గతంలో కూడా కొందరు మద్దతుదారులను పిలిపించి రాజగోపాల్ గెలుపున‌కు పనిచేయాలని ఒత్తిడి పెట్టిన విషయం బయటపడింది.

ఇక రాజగోపాల్ సంగతి చూస్తే ప్రచారంలో ఎదురీదుతున్నారు. కొన్ని గ్రామాల్లో జనాలు ఈ మాజీ ఎమ్మెల్యేని అసలు ప్రచారమే చేసుకోనీయటంలేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తున్నారు. ఇదే సందర్భంగా రాజగోపాల్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోస్టర్లు వెలుస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూనే రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమని బీజేపీలోకి మారారనే విషయం బాగా ప్రచారమైపోయింది. గెలుపోటములను పక్కనపెట్టేస్తే రాజగోపాల్ మీద రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు ముద్ర బాగా పడిపోయింది.

ఇక పార్టీలోని కొందరు లోకల్ లీడర్లు సహాయ నిరాకరణ, గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు జనాల్లో రాజగోపాల్ ఇంకా కాంగ్రెస్ లీడరే అన్న భావన ఎక్కువగా కనబడుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తాను రంగంలోకి దిగకపోతే తమ్ముడి గెలుపు కష్టమని అన్నకు అర్థ‌మైపోయినట్లుంది. అందుకనే మద్దతుదారులకు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఆ ఆడియోలు బయటకు వచ్చేస్తుండటంతో ఏమిచేయాలో ఎంపీకి దిక్కుతోచటంలేదు. దాంతో ఇక్కడుండి చేసేదేమీ లేదని డిసైడ్ అయిన తర్వాతే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  23 Oct 2022 5:21 AM GMT
Next Story