Telugu Global
Telangana

కాంగ్రెస్ లో కొత్త పంచాయితీ.. రేవంత్ క్షమాపణ చెప్పాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తనను కూడా విమర్షించడాన్ని తప్పుబట్టిన వెంకట్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ లో కొత్త పంచాయితీ.. రేవంత్ క్షమాపణ చెప్పాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్
X

కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ లో మరిన్ని పంచాయితీలను పెంచింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తో పాటు తనను కూడా విమ‌ర్శించ‌డంపై వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న రేవంత్ మాట్లాడుతూ.. ''మీ కుటుంబం కోసం కాంగ్రెస్ చాలా చేసింది. మీది బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లేక పోతే మీరు బ్రాంది షాపులో పనిచేసుకోవాల్సి వచ్చేది.'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. మీరు అని తనను కూడా కలిపి మాట్లాడటంపై ఆయన రేవంత్ ను తప్పుబట్టారు.

34 ఏళ్ళుగా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేస్తున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్ పుట్టలేదు. అలాంటి నన్ను అవమానిస్తారా అని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ తనకు తక్షణం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా ను వెంకట్ రెడ్డి వ్యతిరేకించకపోగా ఆయనను సమర్దించినట్టే మాట్లాడారు. ''రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓ జాతీయ పార్టీలో చేరారు. మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారు'' అని వెంకట్ రెడ్డి ఆరోపించారు.

మొత్తానికి రేపు జరగబోయే మునుగోడు ఉపఎన్నిక లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉంటారా ? తమ్ముడికి మద్దతిస్తారా అనేది ఆయన ఈ రోజు మాట్లాడే మాటల‌తో స్పష్టమై పోయింది.

First Published:  3 Aug 2022 3:01 PM GMT
Next Story