Telugu Global
Telangana

రాహుల్‌తో కుదరదు.. సోనియా దగ్గరే తేల్చుకుంటాం..

రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరించడంతో పాటు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానకర పరిస్థితుల గురించి తెలియజేయడం కోసం సోనియా వద్దకు వెళ్తున్నానని, అందుకే ఆమె అపాయింట్‌మెంట్ కోరానని చెబుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రాహుల్‌తో కుదరదు.. సోనియా దగ్గరే తేల్చుకుంటాం..
X

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. తెలంగాణ రాజకీయాల విషయంలో రేవంత్ రెడ్డితోపాటు వారంతా తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై కూడా కోపంగా ఉన్నారు. వీరందరికీ సపోర్ట్ రాహుల్ గాంధీయే అనే అనుమానం కూడా వారిలో ఉంది. ఆ మధ్య రాహుల్ కూడా ఉంటే ఉండండి, లేకపోతే పొండి అంటూ సీనియర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మర్రి శశిధర్ రెడ్డి ఆక్షేపించారు. ఈ క్రమంలో తెలంగాణ అసంతృప్త నేతలు సోనియా వద్ద పంచాయితీ పెట్టబోతున్నారు.

అలా అయితే మునుగోడు వస్తా..

రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరించడంతో పాటు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానకర పరిస్థితుల గురించి తెలియజేయడం కోసం సోనియా వద్దకు వెళ్తున్నానని, అందుకే ఆమె అపాయింట్‌మెంట్ కోరానని చెబుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అదే సమయంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం కూడా తాను రెడీ అంటున్నారు వెంకట్ రెడ్డి. అయితే తనను మునుగోడు ఉప ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించాలనే కండిషన్ పెట్టారు. స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు తనకు అప్పగిస్తే, మునుగోడులో పార్టీ తరఫున‌ ప్రచారం చేస్తానని, పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు వెంకట్ రెడ్డి.

శశిధర్ రెడ్డి కూడా ఢిల్లీకే..

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా సోనియా గాంధీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారని తెలుస్తోంది. టీపీసీసీలో జరుగుతున్న పరిణామాల్ని వివరించేందుకే సోనియాను కలుస్తానంటున్నారాయన. ఇటీవల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శశిధర్ రెడ్డి. మాణిక్కం ఠాగూర్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఆయన ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. వీరిద్దరూ కలసి రాష్ట్రంలోని పరిస్థితులపై హైకమాండ్‌కి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని రాహుల్ ముందు పెడితే పరిష్కారం కాదని భావిస్తున్న శశిధర్ రెడ్డి, నేరుగా సోనియాకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మొత్తమ్మీద మునుగోడు ఉప ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్టు కనిపిస్తోంది. పంచాయితీ రాహుల్ వద్దకు కాకుండా, సోనియా వద్ద పెట్టాలనుకోవడం ఇందులో ట్విస్ట్.

First Published:  18 Aug 2022 3:26 PM GMT
Next Story