Telugu Global
Telangana

కోమటి రెడ్డి కోసం బీజేపీ సర్కార్ ఫిబ్రవరిలో 30 రోజులు పెట్టిందట !

తన తండ్రిని కాపాడుదామని రంగంలోకి దిగిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఆయనే అడ్డంగా బుక్కయిపోయారు. 18 వేల కాంట్రాక్ట్ విషయాన్ని సమర్దించుకోవడానికి ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ తో మరింత రచ్చయిపోయి పోస్ట్ డిలీట్ చేసుకొని పారిపోవాల్సి వచ్చింది.

కోమటి రెడ్డి కోసం బీజేపీ సర్కార్ ఫిబ్రవరిలో 30 రోజులు పెట్టిందట !
X


బీజేపీ సర్కార్ 18 వేల కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు సంకీర్త్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయన తన ట్వీట్ లో ఓ లెటర్ ను పోస్ట్ చేశారు.

ఆ లేఖ లో తమకు వచ్చిన కాంట్రాక్ట్ కు సంబంధించిన వివరాలను పొందుపర్చారు. ఆ లేఖ ప్రకారం... ఝార్ఖండ్ లోని చంద్రగుప్త్ కోల్ మైన్ బొగ్గు గనుల తవ్వకానికి సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 2020 జూన్ 30న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, అరబిందో, మహాలక్ష్మీ, ట్రైడెంట్ కన్సార్టియం, మాంటెకార్లో లిమిటెడ్ లు తమ బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో అదానీ గ్రూప్ అతి తక్కువకు కోట్ చేసినప్పటికీ... ఈ ధరలు ఆమోదయోగ్యం కాదని సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (సీసీఎల్) ఆ టెండర్లను రద్దు చేసింది.

ఆ తర్వాత మళ్ళీ అదేపని కోసం 2021 ఫిబ్రవరి 30న టెండర్లను ఆహ్వానించిందని సంకీర్త్ రెడ్డి ప్రకటనలో ఉంది. ఇందులో సుశీ ఇన్ ఫ్రా కూడా బిడ్ ను దాఖలు చేసింది. అందరికన్నా తక్కువ కోట్ చేసినందున సుశీ ఇన్ ఫ్రాకు ఆ టెండర్ దక్కింది అని సంకీర్త్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఫిబ్రవరిలో 30 వ తేదీ ఎలా వచ్చిందనేదే అర్దంకాక సోషల్ మీడియాలో నెటిజనులు ఆయనను ఆడుకోవడ‍ం మొదలుపెట్టారు. బీజేపీ సర్కార్ కోమటి రెడ్డి కోసం ప్రత్యేకంగా ఫిబ్రవరిలో 30 రోజులు పెట్టిందా ? అని ఒకరు ప్రశ్నించగా, అబద్దాలు రాసేప్పుడైనా కొద్దిగా చూసుకొని రాయాలంటూ మరొకరు పంచ్ విసిరారు. ఈ నెటిజనుల దాడితో... ఏదో తన తండ్రిని కాపాడుదామని రంగంలోకి దిగితే అది మరింత రచ్చయిందనుకున్నారో ఏమో తన ట్వీట్ ను డిలీట్ చేసి మెల్లెగా జారుకున్నారు సంకీర్త్ రెడ్డి.


First Published:  31 Oct 2022 3:22 PM GMT
Next Story