Telugu Global
Telangana

కాంగ్రెస్ చేరికలపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కిషన్ రెడ్డి డబుల్ గేమ్ కి సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థల పేర్లతో నాయకులను బెదిరించి, పార్టీలను చీల్చి, నీఛ రాజకీయాలకు పాల్పడుతోంది ఎవరని నిలదీస్తున్నారు నెటిజన్లు.

కాంగ్రెస్ చేరికలపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణలో పక్క పార్టీ నాయకులకు వల వేసి, తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ హుషారుగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో బీజేపీ సీజన్ నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. అయితే తమ పార్టీలోకి వచ్చే నాయకులు మాత్రం మోదీ అభివృద్ధికి ఆకర్షితులవుతున్నారని, కాంగ్రెస్ లోకి వెళ్లేవారు మాత్రం రేవంత్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీబీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. చేరికలకు తనదైన వక్ర భాష్యం చెప్పారు.

బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో చాలామంది బీఆర్ఎస్ వలస నేతలే, మిగతా వాళ్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజితులు. ఒకటీ రెండు చోట్ల బీజేపీ మార్కు కనపడింది కానీ.. పార్టీని నమ్ముకున్నోళ్లను చాలా చోట్ల బీజేపీ హైకమాండ్ మోసం చేసింది. వలస నేతలకు బీజేపీ టికెట్లిచ్చిన మాట వాస్తవమే అయినా కిషన్ రెడ్డి మాత్రం కవరింగ్ గేమ్ మొదలు పెట్టారు. తమవైపు వచ్చేవారంతా కేంద్రంలో మోదీ పాలన చూసి, అభివృద్ధివైపు అడుగులేస్తున్నారని అన్నారు. షాద్ నగర్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కాంగ్రెస్ బెదిరింపులు..!

కాంగ్రెస్ లోకి వెళ్తున్న నేతలు బెదిరింపులకు లొంగిపోయారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరకపోతే అక్రమ దందా వ్యవహారాలు బయటపెడతామంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ చిత్తశుద్ధితో జరగడం లేదన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను, కాంట్రాక్టర్లను డొనేషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ విధిస్తున్నారని అన్నారు. న్యాయ విచారణ పేరుతో మేడిగడ్డ దర్యాప్తును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టేశారని విమర్శించారు కిషన్‌రెడ్డి.

కిషన్ రెడ్డి డబుల్ గేమ్ కి సోషల్ మీడియాలోనే కౌంటర్లు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థల పేర్లతో నాయకులను బెదిరించి, పార్టీలను చీల్చి, నీఛ రాజకీయాలకు పాల్పడుతోంది ఎవరని నిలదీస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో కూడా బీజేపీలో చేరిన నేతలు మోదీపై ప్రేమతో వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. బెదిరింపు రాజకీయాలు చేస్తున్న బీజేపీ, చివరకు కాంగ్రెస్ ని టార్గెట్ చేయడం విచిత్రం అంటున్నారు హస్తం పార్టీ నేతలు.

First Published:  29 March 2024 11:04 PM GMT
Next Story