Telugu Global
Telangana

ఆ మాటంటే చెప్పుతో కొడతాం..

లోక్ సభ ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచినట్టు చెప్పారు కిషన్ రెడ్డి. వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.

ఆ మాటంటే చెప్పుతో కొడతాం..
X

బీజేపీ అగ్గి లాంటి పార్టీ అని, ఏ పార్టీతోను కలవదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బీజేపీపై ఆరోపణలు చేయాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారాయన. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ వస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు.

ఫైర్ స్టార్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు తగ్గిందనే విషయం వాస్తవం. బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగినా కూడా అధ్యక్ష పదవి మార్పు వ్యవహారంలో కొంతమంది అసంతృప్తితోనే ఉన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన సందర్భంలో.. కిషన్ రెడ్డి ఆ స్థాయి దూకుడు ప్రదర్శించలేదు. కేవలం జాతీయ నాయకుల పర్యటనలపైనే బీజేపీ ఎక్కువగా ఆధారపడింది. అయితే లోక్ సభ ఎన్నికల టైమ్ కి కిషన్ రెడ్డి స్పీడ్ పెంచారు. గతంలో ఎప్పూడూ లేనంతగా ఘాటుగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగాల్సిన పరిస్థితి. అందుకే ఆయన స్పీడ్ పెంచారా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

వారం రోజుల్లో తేల్చేస్తాం..

గతంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల ఆఖరు తేదీ వరకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ రాజకీయ పార్టీలకు ఉంటుందని మీడియాకు క్లాస్ తీసుకున్నారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టిందనుకున్నారో ఏమో.. లోక్ సభ ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచినట్టు చెప్పారు కిషన్ రెడ్డి. వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో.. పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ మొనగాడేమీ కాదన్నారు కిషన్‌ రెడ్డి. ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మూర్ఖుడు ఆయన అని మండిపడ్డారు. ముస్లింలంతా ఎంఐఎంకి మద్దతు తెలపడంలేదని చెప్పారు. మూడో సారి మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కిషన్‌ రెడ్డి.

First Published:  25 Jan 2024 2:10 PM GMT
Next Story