Telugu Global
Telangana

కేసీఆర్, కిషన్ రెడ్డి.. భయపడింది ఎవరు..?

అసలు కిషన్ రెడ్డి ఏ వ్యూహంతో ఒక్క చోట కూడా పోటీ చేయడంలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఓటమి భయం కేసీఆర్ కి లేదని, కిషన్ రెడ్డికి ఉందని, అందుకే ఆయన అసలు పోటీలోనే లేకుండా తప్పుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కేసీఆర్, కిషన్ రెడ్డి.. భయపడింది ఎవరు..?
X

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని తెలిసి, భయపడి కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని అన్నారు. గజ్వేల్, కామారెడ్డి.. రెండు చోట్ల ఈసారి కేసీఆర్ ఓడిపోతారని అన్నారు కిషన్ రెడ్డి. పనిలో పనిగా కేటీఆర్ కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ని కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేందుకే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని, గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు.

జోక్ అదిరింది..

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడంపై కిషన్ రెడ్డి తనదైన వ్యాఖ్యానాలు చేస్తున్నారని, అసలు కిషన్ రెడ్డి ఏ వ్యూహంతో ఒక్క చోట కూడా పోటీ చేయడంలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఓటమి భయం కేసీఆర్ కి లేదని, కిషన్ రెడ్డికి ఉందని, అందుకే ఆయన అసలు పోటీలోనే లేకుండా తప్పుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.

తంటాలు పడుతున్న ప్రత్యర్థులు..

కేసీఆర్ పై పోటీ విషయంలో అత్యుత్సాహంతో నామినేషన్ వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలిద్దరూ ఇప్పుడు తమ సొంత నియోజకవర్గాల్లో గెలుపుకోసం తంటాలు పడుతున్నారు. గజ్వేల్ లో పరాజయం ఖాయమని తెలిసే.. హుజూరాబాద్ ప్రజల దగ్గరకు వచ్చి తన దగ్గర డబ్బుల్లేవు, ఎన్నికల్లో ఖర్చు పెట్టలేనంటూ సింపతీకోసం ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. అటు రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి కష్టమి తెలిసి కొడంగల్ లో ఫోకస్ పెట్టారని అంటున్నారు. గెలుపుపై ఆ ఇద్దరు నాయకులకు లేని ధీమా.. మధ్యలో కిషన్ రెడ్డికి పుట్టుకు రావడమే ఇక్కడ విచిత్రం. కేసీఆర్ రెండు చోట్ల ఓడిపోతారంటూ కిషన్ రెడ్డి చేసిిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వరుస కౌంటర్లు పడుతున్నాయి.

First Published:  15 Nov 2023 11:34 AM GMT
Next Story