Telugu Global
Telangana

రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల విభజన..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తేల్చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు మొండిచెయ్యేనని హింటిచ్చేశారు.

రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల విభజన..
X

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికగా జరిగితే కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. ఉదాహరణలతో సహా నిపుణులు అంచనా వేసిన విషయం ఇది. జనాభా సంఖ్య తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగవు, అదే సమయంలో జనాభా నియంత్రణ విషయంలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు అది అయాచిత వరంగా మారుతుంది, సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం, హవా పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల నేతలంతా ఈ విషయంలో ఉమ్మడిపోరాటానికి సిద్ధమవ్వాలని చూస్తుంటే.. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తేల్చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు మొండిచెయ్యేనని హింటిచ్చేశారు.

మాకు ఆ భేదాలు లేవు..

ప్రధాని మోదీకి నార్త్‌, సౌత్‌ అని తేడాలు లేవన్నారు కిషన్ రెడ్డి. ఉత్తరాది, దక్షిణాది అనే విభేదాలు సృష్టించవద్దని కోరారు. బీజేపీ జాతీయ భావజాలంతో పనిచేస్తుందన్నారు. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, ఇప్పటికిప్పుడు జరుగుతుందని కూడా చెప్పలేమన్నారు. ఎప్పటికైనా రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. పునర్విభజన రాజ్యాంగం ప్రకారమే అంటున్నారు కాబట్టి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది గ్యారెంటీ. ఆ అన్యాయం రాజ్యాంగం ప్రకారం జరిగినా నష్టపోయేది ఇక్కడి ప్రజలే కదా. సొంత రాష్ట్ర ప్రజలు నష్టపోయి, సొంత రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే కిషన్ రెడ్డి స్టేట్ మెంట్లు హాస్యాస్పదం అంటూ కౌంటర్లు పడుతున్నాయి.

బీజేపీనుంచి వలసలు ఉండవు..

బీజేపీలో చేరిన వారెవరూ బయటకి వెళ్లరని అన్నారు కిషన్‌రెడ్డి. ఈ విషయంలో లేనిపోని ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారాయన. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. పార్టీలో నాయకులు చేరితే ప్రభుత్వాలు ఏర్పడవని, ప్రజలు మార్పు కోరుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాము డీలా పడలేదని, బీజేపీ నిరాశ, నిస్పృహలకు లోనయ్యే పార్టీ కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

First Published:  31 May 2023 5:24 PM GMT
Next Story