Telugu Global
Telangana

కాంట్రాక్ట్ పేరు చెప్పాలట.. కిషన్ రెడ్డి గురివింద నీతి..

కిషన్ రెడ్డి సవాళ్లు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డికి కంపెనీలే లేవని, ఆయనసలు కాంట్రాక్టరే కాదని కూడా కిషన్ రెడ్డి చెప్పే అవకాశముంది.

కాంట్రాక్ట్ పేరు చెప్పాలట.. కిషన్ రెడ్డి గురివింద నీతి..
X

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ లు అందాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆ కాంట్రాక్ట్ వర్క్ లు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ, తెచ్చుకుంది రాజగోపాల్ రెడ్డి. మరి ఆ కాంట్రాక్ట్ వర్క్ లు ఏంటో, అవి ఎక్కడ చేస్తారో, వాటి ప్రతిఫలం ఏంటో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా..? కానీ తనకేం తెలియదంటూ అసలు ఆ కాంట్రాక్ట్ వర్క్ ఏంటో చెప్పాలంటూ టీఆర్ఎస్ కి ఆయన ఢిల్లీ నుంచి సవాల్ విసిరారు. ఇంతకంటే వింత, విడ్డూరం ఏదైనా ఉంటుందా..?

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కల్పితాలా..?

ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు తనకు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. తాను మూడేళ్లుగా ట్రై చేస్తుంటే, జస్ట్ ఆరు నెలల క్రితం పనులొచ్చాయని ఒప్పుకున్నారు. అది వక్రీకరణ కాదు అని, నేరుగా ఆయన మాట్లాడిన మాటలేనని క్లియర్ గా తెలుస్తోంది. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వీడియోని ఫేక్ అంటారనడంలో సందేహం లేదు. 18వేలు అనాల్సిన చోట, వేల కోట్లు అని పొరబడి ఉంటారని కూడా మాట మార్చొచ్చు. కిషన్ రెడ్డి సవాళ్లు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డికి కంపెనీలే లేవని, ఆయనసలు కాంట్రాక్టరే కాదని కూడా కిషన్ రెడ్డి చెప్పే అవకాశముంది.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పై కొత్త పల్లవి..

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కి ఓటు వేస్తే, టీఆర్ఎస్ కి వేసినట్టేనని కొత్త పల్లవి అందుకున్నారు కిషన్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పనిచేశాయని, కలసి పోటీ చేశాయని, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పనిచేశారని కూడా లాజిక్ తీస్తున్నారు కిషన్ రెడ్డి. రెండు పార్టీలను ఒకేగాటన కట్టి లాభం పొందాలని చూస్తున్నారు. కానీ మునుగోడు ప్రజలకు ఈపాటికే ఓ క్లారిటీ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, బీజేపీ టికెట్ పై ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయంలో వాస్తవాలు తెలిశాయి. ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వచ్చే ప్రయోజనం ఏంటనేది కూడా వారికి బాగా తెలుసు. అందుకే మునుగోడు వాసులు టీఆర్ఎస్ కి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రిజల్ట్ విషయంలో బీజేపీకి ఓ క్లారిటీ రావడంతో.. క్షేత్రస్థాయికి రాలేక, ఢిల్లీనుంచి అనవసరపు సవాళ్లు విసురుతూ కాలం గడుపుతున్నారు బీజేపీ నేతలు.

First Published:  13 Oct 2022 2:31 AM GMT
Next Story