Telugu Global
Telangana

రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్.. ఈటలకు కీలక పదవి!

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నది. ఇక ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్.. ఈటలకు కీలక పదవి!
X

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత కొన్నాళ్లుగా రాష్ట్ర పార్టీ నాయకత్వం రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమను పట్టించుకోవడం లేదని, పార్టీ బలోపేతానికి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ రెండు నెలల్లో ఖాళీ అవుతుందనే రీతిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో పలు మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించింది.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో ఆయన బీజేపీకి సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పదవులు చేపట్టిన అనుభవం ఉన్నది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అసంతృప్తి గళం వినిపిస్తున్న ఈటల రాజేందర్‌కు ఎన్నికల మేనేజ్‌‌మెంట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ అనే పదవి ఉన్నా.. బీజేపీలో అధికారికంగా అలాంటి పదవి లేకపోవడంతో ఈటల అసంతృప్తితో ఉన్నారు. కేవలం ఈటల కోసమే ఆ పదవిని తెలంగాణలో సృష్టించి.. అప్పగించారు. తాజాగా ఎన్నికల సారథిగా ఈటలను అధిష్టానం నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా డీకే అరుణను నియమిస్తారని సమాచారం. ఇక మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ధర్మపురి అరవింద్‌ను నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలో డిసైడ్ చేశారని.. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అధిష్టానం ఢిల్లీకి పిలవడంతో ఆయన హుటాహుటిన బయలు దేరి వెళ్లారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో బండి సంజయ్ మంతనాలు జరుపుతున్నారని.. పార్టీ అధ్యక్షుడి మార్పుపై తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. మోడీ అధ్యక్షతన ప్రస్తుతం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. అది ముగిసిన తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.

First Published:  3 July 2023 2:49 PM GMT
Next Story