Telugu Global
Telangana

అధ్యక్ష పదవి నాకు, సీఎం సీటు బీసీకి.. ఇదే సామాజిక న్యాయం

ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పాల్గొనేలా రాష్ట్రంలో మరో 6 సభలు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు కిషన్ రెడ్డి. పీఎంఓ, బీజేపీ నాయకత్వం నుంచి ఆమోదం రాగానే వాటిని ఎప్పుడు, ఎక్కడెక్కడ నిర్వహించాలన్నది ప్రకటిస్తామన్నారు.

అధ్యక్ష పదవి నాకు, సీఎం సీటు బీసీకి.. ఇదే సామాజిక న్యాయం
X

రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించాక, బీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇదే బీజేపీ సామాజిక న్యాయమని పేర్కొన్నారు. బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్య‌మ‌ని తేల్చి చెప్పారు. బీసీ సీఎం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను అవమానిస్తోందన్నారు కిషన్ రెడ్డి. పార్టీని నడిపించలేనంటూ రాహుల్‌ గాంధీ విదేశాలకు పారిపోయారని, అలాంటి పార్టీ తమకు నీతులు చెబుతుందా.. అని ఎద్దేవా చేశారు.

నిశ్శబ్ద విప్లవం..

తెలంగాణ ఎన్నికల ఎపిసోడ్ లో బీజేపీ బాగా వెనకపడిందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ కూడా తమ పోటీ కాంగ్రెస్ తోనే అంటోంది, బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తీర్మానించేస్తున్నాయి వైరి వర్గాలు. ఈ నేపథ్యంలో సౌండ్ లేకుండా బీజేపీ సంచలనాలు సృష్టిస్తుందని కిషన్ రెడ్డి చెప్పడం విశేషం. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని అన్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా యువత నుంచి అత్యధిక మద్దతు లభిస్తోందని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పాల్గొనేలా రాష్ట్రంలో మరో 6 సభలు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు కిషన్ రెడ్డి. పీఎంఓ, బీజేపీ నాయకత్వం నుంచి ఆమోదం రాగానే వాటిని ఎప్పుడు, ఎక్కడెక్కడ నిర్వహించాలన్నది ప్రకటిస్తామన్నారు.

కాంగ్రెస్ కి దిక్కులేదు..

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. కర్నాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కులేదు.. మరి తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కు దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్‌ రాలేదని, మరి వాళ్ల 6 గ్యారంటీలను నమ్మేదెలా అని అన్నారు. కాంగ్రెస్‌వి ఫేక్‌ గ్యారంటీలు అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఓట్ల కోసమే ఇచ్చారని మండిపడ్డారు. అందరికీ న్యాయం చేసేలా బీజేపీ మేనిఫెస్టో ఉందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవెరుస్తామని తెలిపారు.


First Published:  21 Nov 2023 3:29 AM GMT
Next Story