Telugu Global
Telangana

బీసీ సీఎం లాగే ఎస్సీ వర్గీకరణ కూడా

ఎస్సీ ఉపకులాల మహాసభలో ప్రధాని మోదీ కూడా ఇంత ధీమాగా వర్గీకరణ చేస్తామని చెప్పలేదు. తాము సానుకూలం అన్నారు, కమిటీ వేస్తున్నాం అని మమ అనిపించారు. అయితే ఈ కమిటీకి కిషన్ రెడ్డి కొత్త వ్యాఖ్యానాలిస్తున్నారు.

బీసీ సీఎం లాగే ఎస్సీ వర్గీకరణ కూడా
X

బీసీ అధ్యక్షుడిని తప్పించారు, బీసీ మహిళకు బీ ఫామ్ ఇవ్వకుండా అవమానించి ఏకంగా పార్టీనుంచి పంపించేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో బీసీలకు బీజేపీ చేసిన అన్యాయాలు చాలానే ఉన్నాయి. కానీ అన్నిటినీ కవర్ చేసుకునేలా బీసీ సీఎం అంటూ తప్పుడు వాగ్దానాన్ని తెరపైకి తెచ్చింది ఆ పార్టీ. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ హామీ కూడా కేవలం రాజకీయ లాభం కోసం ఇచ్చిన అసత్య హామీ అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కమిటీ పేరుతో కాలయాపన వారి ముఖ్య ఉద్దేశమని అంటున్నారు. అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు, వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నామంటూ తాజాగా కవరింగ్ స్టేట్ మెంట్లిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

ఎస్సీ వర్గీకరణ అమలును బీజేపీ తన భుజస్కంధాలపై పెట్టుకుందని అంటున్నారు కిషన్ రెడ్డి. వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలియజేశామని, ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. కోర్టు ద్వారా సాధ్యం కాకపోతే చట్ట పరంగా చేసేందుకు కూడా బీజేపీ, కేంద్రం కట్టుబడి ఉన్నాయని చెప్పారు కిషన్ రెడ్డి.

కమిటీతో కాలయాపన ఎందుకు..?

ఎస్సీ ఉపకులాల మహాసభలో ప్రధాని మోదీ కూడా ఇంత ధీమాగా వర్గీకరణ చేస్తామని చెప్పలేదు. తాము సానుకూలం అన్నారు, కమిటీ వేస్తున్నాం అని మమ అనిపించారు. అయితే ఈ కమిటీకి కిషన్ రెడ్డి కొత్త వ్యాఖ్యానాలిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వర్గీకరణ చేయాలా..? వద్దా..? అన్న అంశంపై కాదని, వర్గీకరణపై కోర్టు కేసులు, ఇతర ప్రాధాన్యతాంశాలను రోజువారీ పర్యవేక్షించేందుకేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిందలు..

ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కారణం అంటున్న కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులుపుకుందన్నారు. మరి పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నాళ్లూ ఈ సమస్యని ఎందుకు పట్టించుకోలేదో ఆయనే చెప్పాలి. హడావిడిగా తెలంగాణ ఎన్నికల వేళ వర్గీకరణకు మేం రెడీ అని స్టేట్ మెంట్లివ్వడం దేనికి సంకేతం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నిందలు వేసే బదులు, అసలు ఇప్పటి వరకూ బీజేపీ చిత్తశుద్ధితో ఏం చేసిందో చెప్పాలంటున్నారు.

First Published:  14 Nov 2023 1:37 AM GMT
Next Story