Telugu Global
Telangana

ఖమ్మంలో రేవంత్ పంచాయితీ.. రాహుల్ సభకు భారీ ఏర్పాట్లు

ఖమ్మంలో పొంగులేటి తన బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అటు భట్టి విక్రమార్క కూడా తన అనుచరగణంతో హడావిడి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది.

ఖమ్మంలో రేవంత్ పంచాయితీ.. రాహుల్ సభకు భారీ ఏర్పాట్లు
X

జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వస్తారు. ఈ బహిరంగ సభకు రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి చేరిక, రెండోది మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు. ఈ రెండిటినీ ఒకే వేదికపై జరపాలని నిశ్చయించింది అధిష్టానం. ఆ ఏర్పాట్ల కోసం రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మంలో పర్యటిస్తారు.

పెద్ద ఎత్తున చేరికల సభ..

పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంలో ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో పొంగులేటి వ్యవసాయ క్షేత్రంలో సభ నిర్వహిస్తారు. 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభ ఉంటుంది. నియోజకవర్గాల వారీగా జన సమీకరణకు పొంగులేటి వ్యూహ రచన చేశారు. రేవంత్ రెడ్డి సభాప్రాంగణాన్ని పరిశీలించేందుకు ఖమ్మం రాబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌, డోర్నకల్‌, సూర్యాపేట, కోదాడ, ములుగు తదితర ప్రాంతాలనుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు.

ఈ సభలో పొంగులేటి చేరిక హైలెట్ అయితే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు వ్యవహారానికి అనుకున్నంత హైప్ ఉండదు. భట్టి యాత్ర ముగింపు హైలెట్ అయితే పొంగులేటి చేరికకు ప్రాధాన్యం తగ్గినట్టవుతుంది. రాహుల్ సమక్షంలోనే రెండూ జరగాలని భావిస్తున్నారు కాబట్టి బల ప్రదర్శనకు నేతలు సిద్దమయ్యారు. ఖమ్మంలో పొంగులేటి తన బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అటు భట్టి విక్రమార్క కూడా తన అనుచరగణంతో హడావిడి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ రెండు కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత రేవంత్ భుజానికెత్తుకున్నారు. ఖమ్మం సభతో తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది.

First Published:  28 Jun 2023 5:24 AM GMT
Next Story