Telugu Global
Telangana

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి ఆమోదం

ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లో ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి ఆమోదం
X

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు వరాలు కురిపించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణకు పసుపు బోర్డు కేటాయిస్తామని ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన బీజేపీ ఎట్టకేలకు దానికి ఆమోద ముద్ర వేసింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ పసుపు బోర్డు వల్ల కేవలం తెలంగాణ రైతులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలోని పసుపు రైతులకు కూడా లాభం కలుగుతుందని తెలిపారు.

ఇక ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లో ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు. తొలి దశలో రూ.1,889 కోట్ల నిధులను కూడా కేటాయిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2015లోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు కావల్సి ఉన్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం సకాలంలో భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్లే ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా జరిగే ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడింది. అయితే కృష్ణా నదికి సంబంధించి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఒక ట్రిబ్యునల్ ఉన్నది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ, తెలంగాణకు మధ్య కృష్ణా నీటికి సంబంధించి నీటి వివాదాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీలో వివాదం ఉన్నది. అందుకే కొత్తగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దీని వల్ల తెలంగాణలోని 50 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.

First Published:  4 Oct 2023 10:27 AM GMT
Next Story