Telugu Global
Telangana

కేసీఆర్ మిషన్-100.. దేశ వ్యాప్తంగా వంద లోక్‌సభ స్థానాల గెలుపే లక్ష్యం!

2024 ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాల్సిన 60 లోక్‌సభ స్థానాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తున్నది.

కేసీఆర్ మిషన్-100.. దేశ వ్యాప్తంగా వంద లోక్‌సభ స్థానాల గెలుపే లక్ష్యం!
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఇకపై చూస్తూ ఊరుకోబోమని.. 2024లో ఓ బలమైన శక్తిగా అవతరిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు సంబంధించి పలు రాష్ట్రాల్లో కిసాన్ సమితిలను ఏర్పాటు చేశారు. ఇక 2024 ఏప్రిల్/మే నెలల్లో జరిగే ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుచుకోవడానికి వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మిషన్-100 పేరుతో దేశ వ్యాప్తంగా కనీసం 100 సీట్లు గెలుచుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

2024 ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాల్సిన 60 లోక్‌సభ స్థానాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తున్నది. 11 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయడం లేదంటే.. కలసి వచ్చే బీజేపీయేతర పార్టీలతో బరిలోకి దిగాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిషన్-100 గురించి పార్టీ సీనియర్లు అయిన బి. వినోద్ కుమార్, ఎస్. మధుసూదన చారితో పాటు ఇతర సీనియర్లతో గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. కనీసం 100 స్థానాలను గుర్తించాలని నిర్ణయించగా.. ఇప్పటికే 60 సీట్లను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, చత్తీస్‌గడ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 60 సీట్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పక్కనే ఉన్న ఏపీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. అక్కడ రాజకీయం కాస్త గందరగోళంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ మరో వ్యూహాన్ని సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి అయితే ఏపీ వ్యవహారాలను పక్కన పెట్టి మిగిలిన రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. క్రిస్మస్ అనంతరం ఢిల్లీ వెళ్లి దీనిపై మరింత లోతుగా చర్చ చేయాలని భావించారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 30న రాష్ట్రపతి నిలయంలో జరుగనున్న ఎట్-హోమ్ కార్యక్రమం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నది.

తెలంగాణ అసెంబ్లీకి 2023 చివరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. అందుకే ముందుగానే మిషన్-100 పేరుతో పోటీ చేసే నియోజకవర్గాలను డిసైడ్ చేసి.. బాధ్యతలకు అప్పగించే అవకాశం ఉన్నది. అవసరం అయితే అభ్యర్థులను కూడా ముందుగానే షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నది. 2023 ఫిబ్రవరి నెలాఖరు లోగా లోక్‌సభ స్థానాలను గుర్తించనున్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన కసరత్తును కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 12 లేదా 13 రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉన్నది. తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తే.. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ టికెట్లకు కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నది. అయినా సరే.. చాలా సెలెక్టీవ్‌గా గెలిచే వారికే టికెట్లు ఇచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే.. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  29 Dec 2022 12:30 AM GMT
Next Story