Telugu Global
Telangana

'సీఎం కేసీఆర్ అన్ని విషయాలు వెల్లడిస్తారు.. బీజేపీ ప్రమాణాలకు విలువేముంది?'

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో చట్టం తన పని తాను చేసుకొని పోతుందని కేటీఆర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడిస్తారని చెప్పారు.

సీఎం కేసీఆర్ అన్ని విషయాలు వెల్లడిస్తారు.. బీజేపీ ప్రమాణాలకు విలువేముంది?
X

- దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలు అర్థం అయ్యింది

- దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడను

- రేపిస్టులనే దండలేసి సన్మానం చేసిన పార్టీ బీజేపీ

- విలేకరుల సమావేశంలో కేటీఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో నిజానిజాలేమిటో సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్, దర్యాప్తు సంస్థలు వివరిస్తాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మేం బాధ్యత కలిగిన వ్యక్తులం, ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. ఇప్పుడు ఏం మాట్లాడినా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామని అంటారు. అందుకే ఆ విషయంపై నోరు మెదపడం లేదని కేటీఆర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలు, టీఆర్ఎస్ సాఫల్యాలపై శనివారం తెలంగాణ భవన్‌లో చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు.

Advertisement

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో చట్టం తన పని తాను చేసుకొని పోతుందని కేటీఆర్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్.. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడిస్తారు. పోలీసులు కూడా తాము చేసిన విచారణను మీడియాకు చెబుతారు. అయినా ప్రజల ముందుకు అన్ని వచ్చాయి. దొంగ ఎవరో.. దొర ఎవరో నిన్ననే తెలుసుకున్నారు. మనం ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు.

నేను బాధ్యత గల మంత్రిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా ఒకటే చెప్తున్నాను.. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలాగా ఏమీ మాట్లాడను. మొన్న పార్టీ శ్రేణులకు కూడా దీనిపై అనవసర విషయాలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశానని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏమైనా మాట్లాడితే.. తిరిగి మేమేదో దురుద్దేశాలు ఆపాదిస్తున్నామని వక్రీకరణ చేస్తారు. అందుకే నేనే స్వయంగా ఆ రిక్వెస్ట్ చేశానని మంత్రి చెప్పారు. మా పార్టీ నాయకత్వానికే ఈ విషయం చెప్పి, నేను ఇప్పుడు తొందరపడి వ్యాఖ్యలు చేస్తే తప్పు అవుతుంది. దర్యాప్తు సంస్థలు నిజాలను నిగ్గు తేలుస్తాయనే నమ్మకం ఉందని కేటీఆర్ వివరించారు.

Advertisement

ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈ కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎందుకని విమర్శించారు. రేపిస్టులకే దండలేసి సన్మానం చేసిన పార్టీ బీజేపీ, వాళ్లు చేసే ప్రమాణాలకు విలువేముంటుందని కేటీఆర్ మండిపడ్డారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని తాకడం అంటే పాపం. దయచేసి ఆ పాపం పోయేలా సంప్రోక్షణ చేయాల్సి ఉంటే చేయాలని వేద పండితులను కేటీఆర్ కోరారు. గుజరాత్ వాళ్ల చెప్పులను మోసే కర్మ బీజేపీ నాయకులకు ఉండొచ్చేమో.. కానీ వాళ్లొచ్చి దేవుడిని తాకితే ఆయన కూడా మలినం అవుతాడని ఎద్దేవా చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటాయని.. ఈ పాపాలకు ప్రక్షాళన చేయాలని పండితులను కోరారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉన్న పార్టీ తాము చేసిన పనులు చెప్పాలి. వ్యక్తిగత దూషణలు, దివాళాకోరు రాజకీయాలను మునుగోడు ప్రజలు హర్షించరని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం మునుగోడులో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న మేము ఏం చేశామో.. స్పష్టంగా చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నాము. గెలిస్తే ఏం చేస్తామో కూడా చెబుతున్నాము. గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని అనాథలా వదిలేశాడు. ఇప్పుడు ఆయన బీజేపీ తరపున నిలబడుతున్నాడు. అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ మునుగోడుకు ఏం చేసిందో చెప్పాలి. అంతే కానీ వ్యక్తిగత నిందారోపణలు చేయడం సబబు కాదు. అందుకే ఈ చార్జిషీటును విడుదల చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.

మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ను నిర్మూలించడానికి బీజేపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలో చౌటుప్పల్‌లో ఫ్లోరోసిస్ కేంద్రం పెడతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను బీజేపీ అనాథలుగా వదిలేసింది. ఇక చేనేత, ఖాదీ ఉత్పత్తులపై పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని కేటీఆర్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కూడా బీజేపీ కుట్ర చేస్తోంది. పెట్రోలు, గ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెంచిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చేయని పనులు ఏమిటో గుర్తు చేయాలనే ఈ చార్జ్‌షీట్ వేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story