Telugu Global
Telangana

మూడేళ్ల తరువాత విజయవాడ‌కు వెళ్ళనున్న కేసీఆర్

సీపీఐ జాతీయ మహాసభల్లో పాల్గొన‌డానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వెళ్ళనున్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి.

మూడేళ్ల తరువాత విజయవాడ‌కు వెళ్ళనున్న కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మూడేళ్ళ తర్వాత విజయవాడ వెళ్లనున్నారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహా సభల్లో ఆయన పాల్గొననున్నారు.ఈ విషయాన్ని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సమావేశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ, బీహార్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, నితీశ్ కుమార్ తో పాటు సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు 20 దేశాల కమ్యూనిస్టు నేతలు హాజరవుతారని తెలిపారు.

మూడేళ్ళక్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడ వెళ్ళారు. ఆ తర్వాత ఇంత కాలానికి ఆయన మళ్ళీ విజయవాడ వెళ్తున్నారు.

ఈ ముగ్గురు ముఖ్యమంత్రులనే కాక బీజేపీయేతర ముఖ్యమంత్రులందరినీ సీపీఐ జాతీయ నేతలు ఆహ్వానించారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతామని హామీ ఇవ్వగా మిగతా వారి రాకపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీపీఐ నేతలు చెప్తున్నారు. అక్టోబర్ 16 వ తేదీన బీజేపీ యేతర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు.

దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియంతృత్వ పాలన సాగుతోందని... రానున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై రాజకీయ తీర్మానం చేసి దిశానిర్దేశం చేస్తామని సీపీఐ నేతలు తెలిపారు.

First Published:  16 Sep 2022 7:11 AM GMT
Next Story