Telugu Global
Telangana

రాజగోపాల్ విమర్శలకు చెక్ పెట్టనున్న కేసీఆర్

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 'ప్రజా దీవెన' పేరుతో నిర్వహించనున్న ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మునుగోడుకు ఏవైనా వరాలు కురిపించే ముందు.. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాజగోపాల్ విమర్శలకు చెక్ పెట్టనున్న కేసీఆర్
X

'నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతుంది. రైతు బంధు వంటి పథకాలు వస్తాయి' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు, తర్వాత పలుమార్లు వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక వచ్చిన దగ్గరే సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారని, పథకాలు అమలు అవుతాయని, ప్రాజెక్టులు ముందు సాగుతాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నాయకులు తరచూ ఆరోపిస్తున్నారు. ప్రజల్లోకి కూడా ఈ మాటలు బాగానే చొచ్చుకొని వెళ్లాయి. ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి జరగుతుందేమో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. వీటన్నింటినీ గమనిస్తున్న సీఎం కేసీఆర్.. రాజగోపాల్ సహా, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 'ప్రజా దీవెన' పేరుతో నిర్వహించనున్న ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మునుగోడుకు ఏవైనా వరాలు కురిపించే ముందు.. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో పూర్తి వివరాలతో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2018 వరకు అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ మొత్తం సమయంలో అధికార టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల డేటాను సీఎం వివరించబోతున్నారు. ముఖ్యంగా రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, రైతు బీమా, సీఎం రిలీఫ్ ఫండ్, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, దళిత బంధు, ధాన్యం సేకరణ, వడ్డీ లేని రుణాల రూపంలో ఎన్ని నిధులు నియోజకవర్గానికి ఇచ్చిందో కేసీఆర్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ సభలోనే కాకుండా.. ఉపఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని సీఎం కేసీఆర్ స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది. ఇంటింటి ప్రచారానికి వెళ్లే సమయంలో ఈ డేటాను ఉంచుకోవాలని సూచించినట్లు సమాచారం. ఉపఎన్నికతో సంబంధం లేకుండా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఎంతటి అభివృద్ధి చేసిందో గణాంకాలను ముందు ఉంచబోతోంది. ఇలా చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నట్లు సీఎం అంచనా వేస్తున్నారు. కేవలం ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అపోహలకు చెక్ పెట్టడంతో పాటు.. రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు సరైన జవాబు ఇచ్చినట్లు ఉంటుందని అనుకుంటున్నారు.

మరోవైపు కేసీఆర్ సభ ముగిసన తర్వాతి రోజే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా బహిరంగ సభలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదని, నిధులు కూడా విడుదల చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో మోడీ బహిరంగ సభకు ముందు కూడా స్వయంగా కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆ సభలో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. మరోసారి రేపటి సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తర్వాతి రోజే మునుగోడులో పర్యటించే అమిత్ షా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇలా కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టి.. ఇన్నాళ్లుగా వస్తున్న విమర్శలకు ఒకే వేదికపై చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.

First Published:  19 Aug 2022 3:03 PM GMT
Next Story