Telugu Global
Telangana

రేపు ఢిల్లీకి కేసీఆర్.. 4 రోజులపాటు హస్తినలోనే మకాం

ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకి పనులు పూర్తయ్యాయి. ఏడాదిపాటు ఈ కార్యాలయాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు.

రేపు ఢిల్లీకి కేసీఆర్.. 4 రోజులపాటు హస్తినలోనే మకాం
X

భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. నాలుగు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేస్తారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభిస్తారు. ఈలోగా పలువురు కీలక నేతల్ని కేసీఆర్ కలిసే అవకాశముంది. అదే సమయంలో బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గ కూర్పుపై ఆయన కసరత్తు మొదలు పెడతారు. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభంతో పాటు జాతీయ కార్యవర్గాన్ని కూడా అదేరోజు ప్రకటిస్తారు.

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారుస్తూ ఈనెల 9న కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై కేసీఆర్ అదేరోజు సంతకం చేశారు. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఈనెల 14న ప్రారంభిస్తానని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఢిల్లీ కార్యాలయ ప్రారంభంకోసం మూడు రోజుల ముందుగానే ఢిల్లీకి బయలుదేరుతున్నారు కేసీఆర్.

ప్రస్తుతానికి తాత్కాలిక కార్యాలయం..

ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకి పనులు పూర్తయ్యాయి. ఏడాదిపాటు ఈ కార్యాలయాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.. కార్యాలయ ప్రారంభోత్సవ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 14న కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారని అంచనా. ఏడాది తర్వాత శాశ్వత భవనంలోకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం షిఫ్ట్ అవుతుంది.

First Published:  11 Dec 2022 11:14 AM GMT
Next Story